Jagan publicity: మేం చేసింది చెప్పుకోలేకపోయాం. ప్రజలకు అన్నీ చేశాం కానీ… వాటిని ప్రచారం చేసుకోలేకపోయాం.. ఇటీవల జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )పార్టీ శ్రేణుల వద్ద వ్యక్తం చేసిన బాధ ఇది. అయితే ఆయన బాధకు కారణం కూటమి ప్రభుత్వం చర్యలు. ఒకవైపు అభివృద్ధి చేస్తోంది. మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఎక్కడా ఆర్భాటం చేయడం లేదు. కానీ ప్రజల్లోకి కూటమి ప్రభుత్వం పనులు వెళుతున్నాయి. ప్రజల నుంచి సానుకూలత వస్తోంది. అలాగని వైసీపీ మాదిరిగా వాలంటీర్లు లేరు. ఐ ప్యాక్ లాంటి టీం కూడా లేదు. అయినా సరే కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ప్రజల్లోకి వెళ్తున్నాయి. దీనిని చూసి జగన్మోహన్ రెడ్డి తలలు పట్టుకుంటున్నారు. అయితే అప్పటికీ, ఇప్పటికీ ఆయన తేడా గుర్తించలేకపోవడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లోటు.
అంతా వాలంటీర్లతోనే
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ హయాంలో వాలంటీర్లు ఉండేవారు. ప్రతి 50 కుటుంబాల బాధ్యతలను చూసేవారు. వారే ప్రతినెలా ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేసేవారు. చక్కటి చిరునవ్వుతో లబ్ధిదారులను పలకరించేవారు. అయితే ఆ పింఛన్ అందిస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కాదని.. అసలు ప్రజా ప్రతినిధులతో సంబంధం లేదని.. వాలంటీర్ల చొరవతోనే తమకు పింఛన్లు అందుతున్నాయని భావించేవారు లబ్ధిదారులు. అస్సలు పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యేలు, మంత్రుల జోక్యం ఉండేది కాదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అలా కాదు. సీఎం చంద్రబాబు ప్రతినెలా ఒకటో తేదీన ఏదో ఒక జిల్లాకు వెళ్తున్నారు. స్వయంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలతో పాటు మంత్రుల సైతం ప్రజల్లోకి వెళ్లి పింఛన్లు అందించగలుగుతున్నారు. తద్వారా సంక్షేమ పథకాలు బాగానే అమలు చేస్తున్నామని.. బాధ్యతగా పర్యవేక్షిస్తున్నామని ప్రజలకు సంకేతాలు పంపగలుగుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పండగలా
ఇటీవల ఆటోడ్రైవర్ల సేవలో( auto driver La sevalo) పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. విజయవాడలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆటోల్లోనే ప్రయాణించి వేదిక వద్దకు చేరుకున్నారు. వేలాది మంది ఆటో డ్రైవర్ల సమక్షంలో పథకాన్ని ప్రారంభించారు. వీలున్నంతవరకు ఎటువంటి హడావిడి లేకుండా.. ఆటో డ్రైవర్లతో మమేకం అయ్యారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించారు. ప్రజల కోసం కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుందన్న ఆలోచనను ప్రజల్లోకి పంపగలిగారు.
అప్పట్లో వారి భాగస్వామ్యం ఏది?
అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం తాము ఎన్నో చేశామని.. చెప్పుకోలేకపోయామన్న బాధ వెనుక.. కూటమి ప్రభుత్వ చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పట్లో ప్రభుత్వ పథకం అమలు చేసిన క్రమంలో మీడియాకు ప్రకటనలు ఇచ్చేవారు. వాలంటీర్లతో పని పూర్తి చేయించేవారు. తాను మాత్రం తాడేపల్లిలో బటన్ నొక్కేవారు. ఎమ్మెల్యేలతో పాటు మంత్రులకు, ముఖ్య నాయకులకు ఎటువంటి పని లేకుండా చేసేవారు. ఆ విషయాన్ని మరిచి తాము అన్నీ చేశామని.. కానీ చెప్పుకోలేకపోయామన్న బాధ పడుతున్నారు. కానీ అసలు విషయాన్ని గ్రహించారు కానీ.. ఆయన ఎట్టి పరిస్థితుల్లో చెప్పుకోలేరు.