YS Jagan temple visit controversy: ఇటీవల ఏపీలో ఒక ఆసక్తికర పరిణామం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. ఆ సమయంలో ఒంటిమిట్ట రామాలయానికి చెందిన ప్రధాన అర్చకులు పులివెందుల వెళ్లి ప్రత్యేకంగా జగన్మోహన్రెడ్డిని ఆశీర్వదించారు. అయితే ఈ చర్యలను ఎట్టి పరిస్థితుల్లో తప్పుపట్టలేం. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. కానీ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఆ అర్చకులు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లడాన్ని టీటీడీ సీరియస్ గా తీసుకుంది. వారికి నోటీసులు జారీ చేసింది. ఎక్కడైనా పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడం, అర్చకుల ఆశీర్వచనాలు అందుకోవడం అనేది సర్వసాధారణం. దీనిని ఎవరూ పట్టించుకోరు కూడా. అయితే ప్రత్యేకంగా పులివెందుల వెళ్లడం వెనుక ప్రాధాన్యం సంతరించుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నేతల ఆదేశాలు లేకపోతే అర్చకులు అక్కడకు వెళ్ళరు కూడా. అయితే ఈ పరిణామం వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉన్నట్లు అర్థమవుతుంది. గతంలో ఎన్నడూ జగన్మోహన్ రెడ్డి ఇలా వ్యవహరించలేదు. ఇలా అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన సమయంలో ఆయన భార్య భారతి రెడ్డి కూడా పక్కనే ఉండడం మరీ విశేషం.
చాలా అరుదైన ఘటనలు..
వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా హిందూ పండుగలలో పాల్గొనడం చాలా అరుదు. ఆయన భార్య భారతీ రెడ్డి సైతం పెద్దగా కనిపించిన సందర్భాలు లేవు. ఒకటి రెండుసార్లు తాడేపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో మాత్రమే ఆమె పాల్గొన్నారు. ప్రముఖ దేవస్థానాలకు పట్టు వస్త్రాలు ఇచ్చే సమయంలో కూడా ఆమె పక్కన ఉండేవారు కాదు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ మతానికి చెందిన వారు. ఆ మత ఆచారాలను పాటించిన నేపథ్యంలో.. అనేక రకాల విమర్శలు వచ్చాయి. అన్య మతస్థుడు అని ప్రత్యర్థులు సైతం ప్రచారం చేసేవారు. అయితే క్రైస్తవ మత ఆచారాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తారని కూడా చాలా సందర్భాల్లో స్పష్టమైంది. తిరుమల డిక్లరేషన్ వివాదం అందులో భాగమే. అయితే అందులో ఏమాత్రం తప్పులేదు. ఎవరి మత ఆచారాలు వారివి. అయితే ఈ విషయంలో మాత్రం రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఒంటిమిట్ట ఆలయ అర్చకులను రప్పించి ఆశీర్వచనం అందుకున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ఉంది.
గతంలో కూడా..
అయితే ఇప్పుడే కాదు 2019 ఎన్నికలకు ఏడాదిన్నర ముందు కూడా ఇటువంటి వ్యవహారాలు నడిపారు. అప్పట్లో విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందతో ప్రత్యక యాగాలతో పాటు పూజలు నిర్వహించేవారు. అప్పట్లో పుష్కరాలకు హాజరైన జగన్మోహన్ రెడ్డి పుష్కర స్నానం చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. అయితే తాజాగా అర్చకుల ఆశీర్వచనం వెనుక బిజెపి కి కోపం రాకుండా చేసేందుకే అలా చేసినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ఉంది. ఒకవైపు హిందూ వ్యతిరేక ముద్ర, ఇటీవల జరిగిన టిటిడి పరిణామాల క్రమంలో హిందువులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నారన్న హెచ్చరికలు వస్తున్నాయి. మరోవైపు ఆర్ఎస్ఎస్ వంటి వాటికి కోపం రాకుండా ఉండేందుకు జగన్ ఇటువంటి చర్యలకు దిగుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. మరి ఈ అనుమానాల్లో ఎంత నిజం ఉందో చూడాలి.