Jagan Foreign Tour Cancelled : మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy ) తరచూ ఒక మాట చెబుతుంటారు. తనకు ఒక సెల్ ఫోన్ కూడా లేదని.. తనది సాదాసీదా జీవితమని చెప్పుకుంటారు. ప్రతి ఒక్కరిలో సెల్ ఫోన్ భాగమవుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి చేసే ఈ ప్రకటన కాస్త అతిగానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయన సెల్ఫోన్ మూలంగా ఉన్నఫలంగా విదేశాల నుంచి రావాల్సిన పరిస్థితి ఎదురయింది. తనకు సెల్ ఫోన్ లేదని చెప్పుకున్న ఆయన.. విదేశీ పర్యటనకు గాను కోర్టు నుంచి షరతులతో కూడిన అనుమతులు తీసుకున్నారు. అయితే సిబిఐ కి సమర్పించిన ఆయన ఫోన్ నెంబర్ సరిగా లేదు. దీంతో సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తక్షణం విదేశీ పర్యటన అనుమతులను రద్దు చేయాలని కోరింది. ఈరోజు ఆ పిటిషన్ విచారణకు రానుంది. కోర్టు సీరియస్ గా తీసుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరమే.
* పుష్కరకాలంగా బెయిల్ పై..
అవినీతి కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు. గత 12 సంవత్సరాలుగా ఆయన బెయిల్ పై కొనసాగుతూ వస్తున్నారు. అయితే విదేశాలకు వెళ్ళినప్పుడు కోర్టు అనుమతి తప్పనిసరి. ఈ తరుణంలో ఇటీవల యూరప్ పర్యటనకు( Europe trip ) వెళ్లారు. తప్పనిసరిగా ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి ఇవ్వాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఆయన ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆయనది కాదు. వేరే ఒకరిది నెంబర్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. యూరప్ వెళ్లారు. అయితే సిబిఐ ఆ ఫోన్ నంబర్ను పరిశీలించగా అది జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉన్నది కానట్టు తెలుస్తోంది. అందుకే సిబిఐ కోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది.
* న్యాయవాదికి నోటీసులు..
సీబీఐ( Central Bureau of Investigation ) దాఖలు చేసిన ఈ పిటిషన్ కు సంబంధించి న్యాయస్థానం జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదికి నోటీసులు ఇచ్చింది. ఈరోజు విచారణ చేపట్టే అవకాశం ఉంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులను సిబిఐ కొనసాగిస్తూ వస్తుండడం పై అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. గత 12 సంవత్సరాలుగా ఆయన బెయిల్ పైనే ఉన్నారు. 2012లో ఆయన అరెస్ట్ జరిగింది. 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. అటు తరువాత బయటకు వచ్చారు. 2014 ఎన్నికల్లో వైసిపి ప్రతిపక్షానికి పరిమితమైంది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండేవారు. 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. 2024 ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష నేత హోదా రాలేదు. దానిపై పోరాటం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.
* తప్పు ఫోన్ నెంబర్..
అయితే అధికారంలోకి వచ్చిన తరువాత చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి తనకు కనీసం ఫోన్ నెంబర్లు లేవని కూడా చెప్పారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో అదే వైరల్ అంశంగా ఉంది. అయితే ఇప్పుడు యూరప్ పర్యటనకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. కోర్టు ఆదేశాల మేరకు ఫోన్ నెంబర్ తో పాటు ఈమెయిల్ ఐడి ఇచ్చారు. కానీ అందులో ఫోన్ నెంబర్ ఆయనది కాదని తెలుస్తోంది. దీంతో సిబిఐ మరోసారి కోర్టును ఆశ్రయించింది. కోర్టును తప్పుదోవ పట్టించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తోంది. ఈ పిటీషన్ పై విచారణ ఈరోజు జరగనుంది. ఒకవేళ కోర్టు సీరియస్గా తీసుకుంటే మాత్రం జగన్ విదేశీ పర్యటనకు ఇబ్బందికరంగా మారనుంది. ఈ నెలాఖరు వరకు యూరప్ పర్యటనలో ఉంటానని జగన్ మోహన్ రెడ్డి షెడ్యూల్ ప్రకటించారు. ఇప్పుడు కోర్టు ఏమైనా సీరియస్ అయితే
.. జగన్ వెంటనే విదేశాల నుంచి రావాల్సి ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.