Ramachandra Rao : బండి సంజయ్ భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. పార్టీ వ్యవహారాలు జోరుగా సాగేవి. అప్పట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తెలంగాణకు అనేక పర్యాయాలు వచ్చారు.. తెలంగాణలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే అన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. సంజయ్ కూడా పార్టీ కార్యకలాపాలను ఉదృతంగా సాగించేవారు. భారత రాష్ట్ర సమితి పరిపాలన కాలంలో బండి సంజయ్ రెండు పర్యాయాలు పోలీసుల చేతిలో అరెస్టు అయ్యారు. బండి సంజయ్ నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీ దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి తిరుగులేని పోటీ ఇచ్చింది. మునుగోడు ఉప ఎన్నికల్లోనూ రెండవ స్థానంలో నిలిచింది. హుజరాబాద్ ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించింది. ఒకరకంగా బండి సంజయ్ భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో జవసత్వాలు కల్పించారని చెప్పుకోవచ్చు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధినాయకత్వం ఒకసారి గా బండి సంజయ్ ని తప్పించింది. ఆయన స్థానంలో కిషన్ రెడ్డి నియమించింది. ఆయినప్పటికీ భారతీయ జనతా పార్టీ 2018 ఎన్నికల తో పోల్చుకుంటే 2023లో గణనీయమైన ఫలితాలను సాధించింది. పార్లమెంటు ఎన్నికల్లో ఏకంగా 8 స్థానాలను సొంతం చేసుకుంది. అయితే బండి సంజయ్ కనుక తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉంటే పార్లమెంటు స్థానాలు మరిన్ని పెరిగేవని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఎందువల్ల బండి సంజయ్ ని మార్చాల్సివచ్చిందో ఇప్పటికీ క్లారిటీ లేదు. బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చినప్పటికీ.. ఇప్పటికీ కార్యకర్తల్లో సంజయ్ లేని లోటు కనిపిస్తూనే ఉంది.
ఇటీవల రామచంద్రరావు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా నియమించింది. ఆయనకు అధ్యక్ష పదవిని ఇవ్వడాన్ని పార్టీలో కొంతమంది నాయకులు జీర్ణించుకోలేకపోయారు. నేరుగా తమ నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ బిజెపి కేంద్ర నాయకత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. అయితే ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ కు పార్టీ కేంద్ర నాయకత్వం తేరలేపినట్టు కనిపిస్తోంది. అందువల్లే భారత రాష్ట్రసమితికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకుంటున్నారు. ఇప్పటికే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బిజెపిలో చేరారు. ఇంకా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు లైన్లో ఉన్నారని రామచంద్రరావు అంటున్నారు. ఒకవేళ గనుక ఇదే స్థాయిలో చేరికలు గనుక కొనసాగితే బిజెపి 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి బలపడుతుందని కాషాయ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు.. రామచంద్ర రావు బండి సంజయ్ మాదిరిగానే పార్టీలో దూకుడు పెంచడానికి ప్రయత్నిస్తున్నారని వారు చర్చించుకుంటున్నారు.. ఒకవేళ రామచంద్రరావు సంజయ్ మాదిరిగానే జోరు కొనసాగిస్తే మాత్రం బిజెపికి తిరుగు ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.