Jagan Latest News: వారిద్దరూ వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ బహిష్కృత నేతలు. పార్టీ నుంచి సస్పెండ్ కు గురయ్యారు. అయినా సరే మనసునిండా అధినేత జగన్మోహన్ రెడ్డిని ఆరాధిస్తున్నారు. తిరిగి పార్టీలో యాక్టివ్ అయ్యేందుకు వారు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారి చర్యల పుణ్యమా అని పార్టీ హై కమాండ్ ఆలోచిస్తోంది. పార్టీలో చేర్చుకునేందుకు చిటపటాయిస్తోంది. అయితే ఎప్పటికైనా వారు వైసీపీ గూటికి తిరిగి రావాల్సిందే. వారికి వేరే ఆప్షన్ కూడా లేదు. ఇంతకీ ఎవరా నేతలు? ఏంటా కథ? అంటే ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, అనంతబాబులు. వీరిద్దరూ ఇప్పటికీ వైసీపీ నే తమ పార్టీగా భావిస్తున్నారు. కానీ పార్టీ మాత్రం వీరిపై వేటు వేసింది.
హత్య కేసుతో..
వైసీపీ హయాంలో రంపచోడవరం( Rampa Chodavaram) ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య జరిగింది. స్వయంగా అనంతబాబు ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు. బెయిల్ పై కూడా బయటకు వచ్చారు. ఆయన చర్యల పుణ్యమా అని పార్టీకి చెడ్డ పేరు వస్తుందని భావించి.. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే అనధికారికంగా ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతూ వస్తున్నారు. రంపచోడవరం ప్రాంతంలో అనంత బాబుకు సామాజిక వర్గంగా పట్టు ఎక్కువ. రిజర్వుడ్ నియోజకవర్గం కావడంతో తనకు అనుకూలమైన నేతను ఎమ్మెల్యేగా గెలిపించుకొని పాలన అంతా ఆయనే సాగిస్తారు. అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం అక్కడ టిడిపి అభ్యర్థి గెలిచారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అందుకే తిరిగి వైసీపీలో యాక్టివ్ అయ్యేందుకు అనంతబాబు ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ హై కమాండ్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు.
కుటుంబ వివాదంతో..
శ్రీకాకుళం జిల్లాకు( Srikakulam district) చెందిన దువ్వాడ శ్రీనివాస్ పరిస్థితి అదే. ఆయన వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కుటుంబంతో విభేదించి తన ప్రేయసి దివ్వెల మాధురీ తో కలిసి ఉంటున్నారు. దీంతో ఈ వ్యవహారం రచ్చకు ఎక్కడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ స్పందించింది. దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతలు దురుద్దేశం పూర్వకంగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని దువ్వాడ ఆరోపిస్తున్నారు. తిరిగి వైసీపీలోకి వస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ దూకుడు కలిగిన నేత. ముఖ్యంగా కింజరాపు కుటుంబం పై గట్టిగానే పోరాడుతూ వచ్చారు. అలా జగన్మోహన్ రెడ్డిని ఆకర్షించారు. ఎమ్మెల్సీ పదవిని తెచ్చుకున్నారు. కానీ కుటుంబ వివాదం పుణ్యమా అని పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు.
అధినేత పట్ల ఆరాధన..
అయితే ఈ ఇద్దరు నేతలు వైయస్ జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) ఆరాధన భావంతో చూస్తున్నారు. తమ మనసు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి వస్తే ఉంటుందని.. తప్పకుండా ఆయన తమను పిలుస్తారని ఆశిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి పిలుపు లేదు. కానీ 2029 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమకు కచ్చితంగా పిలుపు వస్తుందన్న ఆశతో ఆ ఇద్దరు నేతలు ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.