Jagan Key Responsibilities : వైఎస్సార్ కాంగ్రెస్ (YSR Congress)అధినేత పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. అనుబంధ విభాగాను ఏర్పాటుచేస్తున్నారు. ముఖ్యంగా యువజన విభాగాన్ని విస్తరించారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు. వైసీపీ ఆవిర్భావం నుంచి యువజన విభాగం కీలక పాత్ర పోషిస్తోంది. చాలా మంది సీనియర్లు ఆ పదవిని చేపట్టిన వారే. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాక్రిష్ణ ప్రారంభంలో యువజన విభాగం అధ్యక్షుడిగా ఉండేవారు. వైసీపీలో యువత అధికం. యువతను ప్రభావితం చేసే పదవి అది. అందుకే జగన్మోహన్ రెడ్డి యూత్ లో క్రేజ్ ఉండే నాయకులకే ఆ పదవులు ఇస్తుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారికి ప్రాధాన్యం ఇస్తుంటారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను నియమించారు. ఇప్పటికే యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నియమితులయ్యారు. మరోవైపు ప్రధాన కార్యదర్శిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని నియమించారు. ఈయన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు. మొన్నటి ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
అన్ని జిల్లాలకు ప్రాధాన్యం..
అన్ని జిల్లాలకు ప్రాధాన్యం ఇస్తూ యువజన విభాగంలో చోటిచ్చారు. ఉపాధ్యక్షులుగా శ్రీకాకుళం (Srikakulam)జిల్లాకు చెందిన మెంటాడ స్వరూప్, ప్రకాశం జిల్లాకు చెందిన మేరుగు చందన్, అల్లూరిసీతారామరాజు జిల్లాకు చెందిన రేగం చాణుక్య, కడప జిల్లాకు చెందిన షేక్ షఫీవుల్లా నియమితులయ్యారు. రీజనల్ యూత్ అధ్యక్షులుగా..విశాఖకు సంబంధించి అంబటి నాగ వినాయక శైలేష్, కాకినాడకు దాడిశెట్టి శ్రీనివాస్, గుంటూరుకు కల్లం హరిక్రిష్ణరెడ్డి, ప్రకాశంకు మారెడ్డి వెంకటాద్రిరెడ్డి , చిత్తూరు పిట్టా హేమంత్ రెడ్డి,అనంతపురంకు ఎల్లారెడ్డి ప్రణయ్ రెడ్డి నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా కొంగర మురళీక్రిష్ణ, గౌరా శ్రీహరి, దండమూడి రాజేష్, గాలివీటి వివేకానందరెడ్డి, కోటగిరి సందీప్, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, పలిశెట్టి సురేశ్ రాజ్ కుమార్, అచ్యుతరామిరెడ్డి నియమితులయ్యారు.
Also Read : జగన్ లో నాటి దూకుడేదీ..ఇలాగైతే కష్టమే
జిల్లాల పర్యటన నేపథ్యంలో..
త్వరలో జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohanreddy) జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే యువజన విభాగాన్ని విస్తరించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యువజన విభాగం క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని జగన్ ఒక నిర్ణయానికి వచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది యువతే కనుక.. యూత్ విభాగాన్ని బలోపేతం చేయాలని భావించారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. గత ఏడాది జూన్ 4న ఫలితాలు వచ్చాయి. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని జగన్ తరచూ విమర్శలు చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్న తరుణంలో జూన్ 4న వెన్నుపోటు దినంగా జరుపుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అదే సమయంలో యువజన విభాగాన్ని విస్తరిస్తూ నియామకాలు చేయడం విశేషం.
ప్రత్యేక భేటీ..
తాజాగా నియమితులైన యువజన విభాగం ప్రతినిధులతో తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక సమావేశం కానున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధులతో వరుసగా సమావేశాలవుతూ వస్తున్నారు. వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. తాజాగా యూత్ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎలా ఎండగట్టాలో వివరించనున్నారు. అయితే యూత్ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఉండగా.. అధ్యక్షుడిగా జక్కంపూడి రాజాను నియమించడంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.