YCP Social Media : వైసీపీకి కొత్త సోషల్ మీడియా ఇంచార్జ్ ఎంపికయ్యారా?ఆ పదవి నుంచి సజ్జల భార్గవ్ రెడ్డిని తొలగించారా?కొత్తగా అశోక్ రెడ్డి అనే వ్యక్తిని నియమించారా?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పదవి పవర్ ఫుల్.ఒక విధంగా చెప్పాలంటే పార్టీ అధినేత తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న పోస్ట్.గతంలో సోషల్ మీడియా వ్యవహారాలను పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి చూసేవారు.కానీ అనూహ్యంగా సజ్జల భార్గవ్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.అప్పట్లో సకల శాఖామంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డి.సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీ కార్యాలయ బాధ్యతలను అప్పగించారు జగన్.కానీ క్రమేపి తన ప్రస్థానాన్ని,ప్రాధాన్యతను పెంచుకుంటూ ముందుకు సాగారు సజ్జల. దీంతో పార్టీలోనూ,ప్రభుత్వంలోనూ సజ్జల ప్రాధాన్యత పెరిగింది. అప్పటివరకు విజయ సాయి రెడ్డి వద్ద ఉన్న చాలా పదవులుసజ్జల రామకృష్ణారెడ్డి సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా ఇన్ఛార్జి పదవిని సైతం తన కుమారుడు భార్గవరెడ్డికి అప్పగించుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే సజ్జల తండ్రి కొడుకులకు విపరీతమైన ప్రాధాన్యమిచ్చారు జగన్. కానీ ఈ ఎన్నికల్లో ఓడిపోయేసరికి సజ్జలతో పాటు ఆయన కుమారుడు భార్గవ రెడ్డి సైలెంట్ అయ్యారు. కేసులకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం సాగుతోంది.
* తనకు తానుగా ప్రకటన
తనను సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నియమించారంటూ అశోక్ రెడ్డి అనే వ్యక్తి ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు. ఈయన అమెరికాలో ఉండేవారు. వైసిపి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అందుకే సీఎం జగన్ ఆయనకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. అయితే అమెరికా నుంచి రిమోట్ చేస్తారా? రాష్ట్రానికి వచ్చి సోషల్ మీడియా వింగ్ ను నడుపుతారా? అన్నది తెలియాల్సి ఉంది.
* అజ్ఞాతంలోకి భార్గవ్ రెడ్డి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సజ్జల భార్గవ్ రెడ్డి సైలెంట్ అయ్యారు. ఆయన అరెస్టు తప్పదని ప్రచారం సాగింది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు టిడిపి తో పాటు రాజకీయ ప్రత్యర్థులపై వైసీపీ సోషల్ మీడియా ఇబ్బందికర పోస్టులు పెట్టింది. రకరకాలుగా వేధించింది. అందుకే సోషల్ మీడియా పై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. అప్పటినుంచి సజ్జల భార్గవ్ రెడ్డి జాడలేకుండా పోయింది. ఆయన విదేశాలకు వెళ్లిపోయినట్లు ప్రచారం సాగింది.
* అమెరికాలో ఉంటూ ఆపరేట్
అయితే తాజాగా అశోక్ రెడ్డి నియామకంతో సజ్జల భార్గవరెడ్డికి గుడ్ బై చెప్పినట్టే. అశోక్ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు. అమెరికాలో ఉండడంతో సోషల్ మీడియాను ఆయనకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది సోషల్ మీడియాను విదేశాల్లో ఉండి ఆపరేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అశోక్ రెడ్డికి ఈ బాధ్యతలు కట్టబెడుతూ జగన్ నిర్ణయం తీసుకోవడం విశేషం. అయితే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నియామకం పై మాత్రం ఇంతవరకు అధికారిక ప్రకటనరాలేదు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More