YS Jagan Mohan Reddy : ఎన్నికల్లో వైసిపి దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలోకి దిగారు జగన్. కానీ ప్రజలు మాత్రం గుర్తించలేదు. 11 స్థానాలకు పరిమితం చేశారు. వైసీపీ నేతలకు ఊహించని అపజయం ఇది. కనీసం 90 సీట్లతోనైనా అధికారంలోకి వస్తామని వారు భావించారు. కానీ బయటకు మాత్రం వై నాట్ 175 అన్న నినాదాన్ని తెరపైకి తెచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో జగన్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎన్నో రకాల ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. ఈ జాబితాలో మంత్రుల సైతం ఉన్నారు. కొందరి నైతే ఏకంగా జిల్లాలకు జిల్లాలే దాటించేశారు. దీనిపై పార్టీ నేతల నుంచి అభ్యంతరాలు వచ్చినా పట్టించుకోలేదు. ఓటమి ఎదురయ్యేసరికి అది తప్పుడు నిర్ణయంగా తేలింది. ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు జగన్.
* పెద్ద పెద్ద నేతలకు స్థానచలనం
మంత్రి గుడివాడ అమర్నాథ్ ను అనకాపల్లి నుంచి తప్పించారు. చివరి నిమిషంలో గాజువాక నుంచి పోటీ చేయించారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరు సిటీ నుంచి తప్పించారు. నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి పంపించారు. ఎక్కడో విజయనగరం జిల్లా రాజాం సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులును అయితే అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు పంపించారు. ముఖ్యంగా ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో తన ఇష్టానుసారంగా మార్పులు చేశారు. తనను చూసి ప్రజలు ఓటేస్తారని భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది.
* తిరిగి అదే స్థానాలు
ఇప్పుడు పార్టీని గాడిలో పెట్టే క్రమంలో వైసీపీ నేతలకు యధా స్థానాలను అప్పగిస్తున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు తిరిగి నెల్లూరు సిటీ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా నెల్లూరు జిల్లా బాధ్యతలు తీసుకోవాలని ఒత్తిడి పెడుతున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి గెలిచిన అనిల్ కు మంత్రి పదవి ఇచ్చి ప్రమోట్ చేశారు. కానీ ఈ ఎన్నికల్లో ఆయనపై వ్యతిరేకత ఉందని చెబుతూ నరసరావుపేట ఎంపీ స్థానానికి పంపించారు. అయినా సరే ఆయనకు ఓటమి తప్పలేదు.
* ఖాళీ అయిన స్థానాల్లో
మంత్రిగా ఉన్న జోగి రమేష్ ను నియోజకవర్గం తప్పించారు. ఆయనకు సైతం ఓటమి తప్పలేదు. ఆయన కోరిక మేరకు తిరిగి యధా స్థానానికి పంపించారు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి నేతలు కూటమి పార్టీల్లో చేరుతుండడంతో… పార్టీ బాధ్యతలు కొత్తవారికి అప్పగించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. అందుకే 80 నియోజకవర్గాల్లో తిరిగి పాతవారిని నియమించేందుకు జగన్ పావులు కదుపుతున్నారు. ఎన్నికల ముందు చేసిన తప్పిదాన్ని ఇప్పుడు సరి చేసుకునే పనిలో పడ్డారు జగన్. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.