TTD Laddu Issue : తిరుపతి లడ్డు వివాదం మరింత వివాదాస్పదం అవుతోంది. 150 కోట్ల మంది హిందువుల మనోభావాలు క్షోభకు గురయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవస్థానం తిరుమలలో లడ్డు ప్రసాదం పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. జంతు కొవ్వుతో కలిసిన నెయ్యిని లడ్డు తయారీకి వినియోగించారు అన్నది ప్రధాన ఆరోపణ. వైసిపి ప్రభుత్వ హయాంలోనే ఇది జరిగిందని టిడిపి ఆరోపించింది. సాక్షాత్ సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అప్పటినుంచి వివాదం రగులుతూనే ఉంది. ఇదో రాజకీయ అంశంగా మారిపోయింది. పరస్పర ఆరోపణలకు కారణమవుతోంది. మున్ముందు ఈ పరిణామం జఠిలం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రామ జన్మభూమి వివాదాన్ని గుర్తుచేసేలా ఇది ఉంది. దశాబ్దాలుగా ఇదో రాజకీయ అంశంగా మారిన సంగతి తెలిసిందే. ప్రజలు, ముఖ్యంగా భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నందున.. న్యాయస్థానాలు సైతం తీర్పు చెప్పేందుకు ఆసక్తి చూపవు. ఇది రామ జన్మభూమి వివాదంలో సైతం స్పష్టమైంది. మరోసారి అదే రిపీట్ కానుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
* తెరపైకి భావోద్వేగాలు
సాధారణంగా ప్రజల్లో భావోద్వేగాలతో కూడిన వివాదం విషయంలో.. ప్రభుత్వాలు కొన్ని వినతులు చేస్తాయి. ప్రజల్లో ఒక రకమైన భావోద్వేగంతో ఉంటే శాంతిభద్రతలు పరిరక్షించలేమని..తమ విన్నపాలను సైతం పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాయి.అదే సమయంలో జ్యుడీషియల్ వ్యవస్థ సైతం వెనక్కి తగ్గుతుంది. ప్రజల భద్రత ముఖ్య కర్తవ్యం గా న్యాయవ్యవస్థ భావిస్తుంది. అందుకే తీర్పు చెప్పేందుకు అంతగా ఆసక్తి చూపవు. తమ తీర్పు ద్వారా జరిగే మేలు కంటే.. వాటి వల్ల జరిగే అనర్థాలను సైతం న్యాయవ్యవస్థ పరిగణలోకి తీసుకుంటుంది. అందుకే దశాబ్దాలుగా విచారణ పేరిట జాప్యం జరుగుతుందే తప్ప.. ఎటువంటి ప్రయోజనం ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
* దశాబ్దాలుగా వివాదంగానే
అయితే దశాబ్దాలుగా రామజన్మభూమి వివాదం రాజకీయాలకు వరంగా మారింది. కొన్ని పార్టీలు ఉనికి చాటుకున్నాయి. ఆ నినాదంతోనే రాజకీయంగా బలపడ్డాయి. ఏపీలో కూడా తిరుపతి లడ్డు వివాదం రాజకీయ అంశంగా మిగిలిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. న్యాయవ్యవస్థ తేల్చదు.విచారణ సక్రమంగా జరగదు. ఒకవేళ విచారణ జరిగి బాధ్యుల పేర్లు ప్రకటించినా.. దానికి హేతుబద్ధత ఉండదు. కేవలం రాజకీయ కక్షతోనే ఆరోపణలు చేస్తున్నట్లు చెప్పుకొస్తారు. ఇదే అంశాన్ని ముడిపెట్టి అనేక వివాదాలను తెరపైకి తెస్తారు. మొత్తానికి అయితే మరో రామ జన్మభూమి వ్యవహారం మాదిరిగా.. తిరుపతి లడ్డు వివాదం మిగిలిపోతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.