Jagan: ప్రభుత్వాలు మారితే చాలామంది టార్గెట్ అవుతారు. అది సాధారణ పరిణామమే. కానీ కొంచెం అతిగా వ్యవహరించే వారు మాత్రం ఇబ్బందుల్లో పడతారు. తనను జైలుకెళ్లేలా చేశారని చంద్రబాబుపై జగన్ రివెంజ్ తీర్చుకున్నారు. అవినీతి కేసుల్లో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉంచగలిగారు. అయితే ఈ మొత్తం కేసుల్లో మాత్రం ప్రధాన పాత్ర పోషించారు ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. సహజంగానే ఆయనపై టిడిపి శ్రేణులు విపరీతమైన కోపం ఉంటుంది. దీనికి తోడు వైఎస్ అభిమానుల్లో సైతం ఆయనపై ఒక రకమైన కోపం ఉంది. జగన్ అవినీతి కేసులకు సంబంధించి చార్జిషీట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరును జత చేర్చింది పొన్నవోలు అని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. చివరకు తన ప్రమేయం లేదని పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పాల్సి వచ్చింది.
ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అక్కడ వైసీపీ ఎన్నారైల విభాగంతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారట. పరిస్థితిని తలుచుకొని ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయ్యారట. ఏపీ సీఎం జగన్ ప్రమాదంలో ఉన్నారని.. ఆయనను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారట. సీఎం జగన్ ఎన్నో అవమానాలు, అనుమానాలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారట. ఎవరిని నమ్మాలో, ఎవరిది నమ్మ కూడదోతెలియడం లేదని బాధపడ్డారట. మొత్తానికి అయితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏదో విషయంలో భయపడుతున్నారని మాత్రం తెలుస్తోంది.ఏపీ ఎన్నికల పోలింగ్, తరువాత జరుగుతున్న ప్రచారం పై వారితో చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వైసీపీకి ఎన్నారైల నుంచి అద్భుత సహకారం అందడంపై పొన్నవోలు సుధాకర్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తరహా సహకారం వైసీపీకి మున్ముందు అవసరమని.. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన కోరారు. జగన్ క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటున్నారని.. మనమంతా ఆయనకు సహకరించాలని కోరుతూ ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. చాలాసేపు మౌనంగా ఉండి పోయారు. దీంతో ఒక్కసారిగా ఎన్నారైలు షాక్ కు గురయ్యారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యవహార శైలి వారిలో చర్చకు వచ్చింది. ఎన్నికల ప్రచారంలో పొన్నవోలు వ్యవహారం బయటపడింది. పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల నేరుగా పొన్నవోలు పేరును ప్రస్తావించారు. జగన్ ఆదేశాలతోనే రాజశేఖర్ రెడ్డి పేరును చార్జిషీట్లో దాఖలు చేశారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ పొన్నవోలు తీరుపై ఆగ్రహంగా ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం ఆయన పై ఫోకస్ పెట్టింది. ఇంకోవైపు ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ జగన్ అధికారానికి దూరమైతే తన పరిస్థితి ఏంటి అన్న ఆందోళన పొన్నవోలులో కనిపిస్తోందని టాక్ నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.