Phone Tapping Case: కవితను తప్పించేందుకే.. ఎమ్మెల్యే కొనుగోలు ఎత్తుగడ.. సంచలన విషయం లీక్

కేసీఆర్‌ స్కెచ్‌ ప్రకారమే మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ కేసుకు తెరతీశారని వెల్లడించారు. బీజేపీ అగ్రనేత బీఎల్‌.సంతోష్‌ను అరెస్టు చేయడమే లక్ష్యంగా ఈ వ్యవహారం నడిపించారని పేర్కొన్నారు.

Written By: Raj Shekar, Updated On : May 28, 2024 10:46 am

Phone Tapping Case

Follow us on

Phone Tapping Case: తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్‌ ట్యాపింగ్‌(Phone Tapping) కేసులో ప్రధాన సూత్రధారి అయిన మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు సంచలన విషయాలు వెల్లడించారు. విచారణలో పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్‌ చేశామో పూసగుచ్చినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఇరుక్కున్న తన కూతురు కవితను కాపాడేందుకు పెద్ద ఎత్తుగడ వేశారని వాగ్మూలంలో తెలిపారు. ఎమ్మెల్యే కొనుగోలు అంశాన్ని తెరపైకి తెచ్చానని పేర్కొన్నారు. ఎస్‌బీఐ చీఫ్‌గా ఉన్న ప్రభాకర్‌రావు ఈ విషయంపై తనతో చర్చించాడని వెల్లడించారు.

బీజేపీని లొంగదీసుకోవాలని..
కవితను లిక్కర్‌ కేసు నుంచి తప్పించేందుకు బీజేపీని లొంగదీసుకోవాలని కేసీఆర్‌ ఎత్తుగడ వేసినట్లు రాధాకిషన్‌రావు తెలిపారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ను వీడి, బీజేపీలో చేరడానికి సిద్ధమైన పైలట్‌ రోహిత్‌రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేల విషయం తెలుసుకుని వారిపై సర్వేలెన్స్‌ పెట్టాలని కేసీఆర్‌ ఎస్‌ఐబీ చీఫ్‌కూ సూచించారని తెలిపారు. ఈ క్రమంలోనే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి ఆ ఆడియోను అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి తెరలేపారని వెల్లడించారు. బీజేపీ అగ్రనేతల ఫోన్లను ప్రణీత్‌రావు బృందం ట్యాపింగ్‌ చేసిందని తెలిపారు.

స్కెచ్‌ ప్రకారమే ఫామ్‌హౌస్‌ అంశం..
ఇక కేసీఆర్‌ స్కెచ్‌ ప్రకారమే మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ కేసుకు తెరతీశారని వెల్లడించారు. బీజేపీ అగ్రనేత బీఎల్‌.సంతోష్‌ను అరెస్టు చేయడమే లక్ష్యంగా ఈ వ్యవహారం నడిపించారని పేర్కొన్నారు. ఇందుకోసం ఫామ్‌హౌస్‌లో ముందుగానే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారని వెల్లడించారు. అయితే ఫామ్‌హౌస్‌కు బీఎల్‌.సంతోష్‌ వస్తాడని ఆశించారని తెలిపారు. కానీ, ఇతరులు రావడంతో సంతోష్‌ను అరెస్ట్‌ చేయాలన్న వ్యూహం బెడిసి కొట్టిందని వెల్లడించారు.

కవితను తప్పించేందుకే..
కవితను లిక్కర్‌ కేసు నుంచి తప్పించేందుకే కేసీఆర్‌ బీఎల్‌.సంతోష్‌ను అరెస్టు చేయాలని భావించారన్నారు. తద్వారా బీజేపీ తన వద్దకు కాళ్లబేరానికి వస్తుందని అంచనా వేశారని తెలిపారు. కొంతమంది సైబరాబాద్‌ పోలీసుల అసమర్థతతో అరెస్టు ప్రయత్నాలు విఫలమయ్యాయని, దీంతో కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా రాధాకిషన్‌రావు వెల్లడించారు.

మొత్తానికి ఎమ్మెల్యేల కొనుగోలు అంశం పూర్తిగా కేసీఆర్‌ ముందస్తు ప్లాన్‌ అని రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో స్పష్టం చేశారు. ఇది బీజేపీకి అనుకూలించే అంశమే..