Peddireddy Ramachandra Reddy : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జగన్ పక్కన పెట్టారా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రాధాన్యమిస్తున్నారా? బాలినేని చెప్పిన దాంట్లో నిజం ఎంత? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లుగా ఆ ఆరుగురిని నియమించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించారు జగన్. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్దన్నారని చెప్పి మిధున్ రెడ్డిని ప్రకాశం జిల్లా సమన్వయకర్త పదవి నుంచి తప్పించారు. ఇదే విషయంపై తాజాగా మాట్లాడారు బాలినేని. తనపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసేసరికి ఓపెన్ అయ్యారు బాలినేని. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాక పెద్దిరెడ్డిని సైడ్ చేశారని చెప్పుకొచ్చారు. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్ కావడం మాత్రంఏదో జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. గత ఐదేళ్లలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి జగన్ చాలా అవకాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు ఓటమి తర్వాత పెద్దిరెడ్డి ప్రాధాన్యతను తగ్గిస్తూ వచ్చారు.
* రాయలసీమ బాధ్యతలు
వైసీపీకి రాయలసీమలో చాలా పెద్ద నేతలు ఉన్నారు. కానీ వారందరినీ కాదని పెద్దిరెడ్డికి ఛాన్స్ ఇచ్చారు జగన్. మొత్తం రాయలసీమ బాధ్యతలని అప్పగించారు. కుప్పంలో చంద్రబాబును, హిందూపురంలో బాలకృష్ణను ఓడించాలని కూడా సూచించారు. పెద్దిరెడ్డి సర్వశక్తులు ఒడ్డారు. కానీ చంద్రబాబును టచ్ చేయలేకపోయారు. రాయలసీమ మొత్తాన్ని కైవసం చేసుకుంది కూటమి. చివరికి కడపను విడిచిపెట్టలేదు. అప్పటినుంచి పెద్దిరెడ్డి పై ఒక భావంతో ఉన్నారు జగన్. పట్టున్న వైసీపీని రాయలసీమలో దెబ్బతీసింది పెద్దిరెడ్డి అన్న అనుమానం మొదలైంది. అందుకే పెద్దిరెడ్డిని సైడ్ చేశారు. చెవిరెడ్డిని తన కోటరీలోకి తెచ్చుకున్నారు. పెద్దిరెడ్డికి ప్రాధాన్యత పూర్తిగా తగ్గించేశారు.
* నగిరిలో పెద్దిరెడ్డి అనుచరులపై వేటు
నగిరిలో రోజా ప్రాతినిధ్యం వహించేవారు. ఆమె మంత్రిగా కూడా ఉండేవారు. అయితే రోజాపై అసమ్మతి వర్గాన్ని రేపింది పెద్దిరెడ్డి అని జగన్ కు తెలుసు. కానీ ఎన్నికలకు ముందుఏదైనా చర్యలకు ఉపక్రమిస్తే అది ఇబ్బందికరంగా మారుతుందని జగన్ భావించారు. అందుకే ఎన్నికల ఫలితాల తర్వాత రోజా ఫిర్యాదు చేసిందే తరువాయి నగిరిలో చాలామంది వైసిపి నాయకులపై వేటు పడింది. వారంతా పెద్దిరెడ్డి అనుచరులే. తెలిసి కూడా చర్యలకు ఉపక్రమించారంటే జగన్ ఎంత ఆలోచిస్తున్నారో అర్థమవుతోంది. ఇంకోవైపు చిత్తూరు జిల్లా బాధ్యతలు నుంచి పెద్దిరెడ్డిని తొలగించి భూమన కరుణాకర్ రెడ్డికి అప్పగించారు జగన్. భాస్కర్ రెడ్డి చెప్పారని మిథున్ రెడ్డిని ప్రకాశం జిల్లా బాధ్యతలు నుంచి తప్పించారు. ఈ క్రమంలో పెద్దిరెడ్డిని వదులుకోవడానికి జగన్ సిద్ధమేనన్న సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో పెద్దిరెడ్డి గత పదేళ్లుగా మరో పార్టీలో చేరలేని విధంగా రాజకీయాలు చేశారు. అందుకే వైసిపిలో అవమానాలు ఎదురవుతున్నా.. మౌనంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.