YS Jagan : సొంత జిల్లా కడపలో సైతం జగన్ స్వేచ్చగా పర్యటించలేకపోతున్నారు. అవే పరదాలు , బ్యారికేడ్లు దర్శనమిస్తున్నాయి. అడుగుకో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. కడప అంటేనే వైఎస్ కుటుంబం జమానా. దశాబ్దలుగా ఆ కుటుంబానికి పెట్టని కోట. అటువంటి చోట సైతం జగన్ స్వేచ్చగా తిరగలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికారంలోకి రాక ముందే జనమే నాహితం.. వారే తన అభిమతమంటూ చెప్పుకొచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత జనాలను కలిసేందుకు ఇష్టపడడం లేదు. సీఎం వస్తున్నారంటే ఒకటే హడావుడి. ప్రజా రవాణా వ్యవస్థను స్తంభింపజేస్తున్నారు. నివాసాల ముందు బారికేడ్లు ఏర్పాటుచేస్తున్నారు. సీఎం కనిపించకుండా పరదాలు కట్టేస్తున్నారు.
మూడు రోజుల పర్యటన కోసం సీఎం జగన్ కడప జిల్లాకు వచ్చారు. సోమవారం కడప నగరపాలక సంస్థలో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఉదయం 11 గంటలకు సీఎం పర్యటన ఉండగా.. 6 గంటల నుంచే ఆంక్షలు విధించారు. పలు రోడ్లపై రాకపోకలను నిలిపివేశారు. విధులకు హాజరయ్యే ఉద్యోగులు, ఆస్పత్రులకు వెళ్లే రోగులు, వారి సహాయకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అన్నిదారులను మూసివేస్తే తాము ఎలా వెళ్లాలి అంటూ నిలదీశారు. ఉన్నతాధికారుల ఆదేశాలని.. తామేమీ చేయలేమని పోలీస్ సిబ్బంది నిస్సహాయత వ్యక్తం చేశారు. అటు పోలీసులు సైతం నానా హైరానా పడుతున్నారు. ప్రజల నుంచి ప్రశ్నలను తట్టుకునే విధులు నిర్వహించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.
కడపలోని రాజీవ్ పార్కులోని రాజీవ్ మార్గ్ రహదారిని సీఎం జగన్ ప్రారంభించారు. కానీ చుట్టుపక్కల నిర్బంధం కొనసాగడంతో సమీప నివాసితులు అసౌకర్యానికి గురయ్యారు. ఇంటి ముందు పరదాలు కట్టేయ్యడంతో బయటకు వచ్చేందుకు కూడా ఇబ్బందిపడ్డారు. రాజీవ్ పార్కు చుట్టూ ఎందుకో పరదాలు కట్టేశారు. కనీసం సీఎం జగన్ ను చూసే చాన్స్ కూడా ఇవ్వలేదు. అటు జగన్ సైతం ప్రజలతో మాట్లాడేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎర్రముక్కపల్లి, సంధ్యా పార్కు సర్కిల్ జంక్షన్ లో అస్సలు వాహనాలను రానివ్వలేదు. దీంతో అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా నిర్బంధించారు. ఎక్కడికక్కడే హౌస్ అరెస్టులు చేశారు.