https://oktelugu.com/

Budget 2024-YCP : కేంద్ర బడ్జెట్ పై మాట్లాడని వైసిపి.. వ్యతిరేకిస్తే అలా.. ఆహ్వానిస్తే ఇలా.. డిఫెన్స్ లో జగన్!

కేంద్ర ప్రభుత్వం ఏడు మాసాల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ లో ఓటాన్ బడ్జెట్ ను మాత్రమే ఆమోదించింది. ఇప్పుడు కొలువు దీరడంతో శాశ్వత బడ్జెట్ ను సభలో పెట్టింది. ఏపీకి కేటాయింపులు చేసింది. దీనిపై అన్ని వర్గాలు స్పందిస్తున్నా.. వైసీపీ నుంచి ఉలుకూ పలుకూ లేదు

Written By:
  • Dharma
  • , Updated On : July 23, 2024 / 07:18 PM IST
    Follow us on

    Budget 2024-YCP : కేంద్ర బడ్జెట్ లో ఏపీకి సముచిత స్థానం దక్కింది. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం పెద్దపీట వేసింది. ఏకంగా 15 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సైతం సాయం చేస్తామని ప్రకటించింది. వెనుకబడిన జిల్లాలకు నిధులు సమకూర్చుతామని కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీకి బడ్జెట్లో పెద్దపీట వేశారు. తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో అక్కడి అధికారపక్షం, విపక్షం కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాయి. దాయాది రాష్ట్రానికి బడ్జెట్లో కేటాయింపులపై ఆహ్వానిస్తున్నాయి. కానీ ఏపీలో మాత్రం విపక్షంగా ఉన్న వైసిపి ఇంతవరకు స్పందించలేదు.

    * ఆ ఇబ్బందులతోనే
    వైసిపి స్పందించడానికి రెండు రకాల ఇబ్బందులు ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ పై ప్రతికూల వ్యాఖ్యలు చేస్తే.. కేంద్ర ప్రభుత్వానికి ఆగ్రహం రావడం ఖాయం. అసలే ఘోర పరాజయంతో వైసీపీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. కచ్చితంగా కేసులు చుట్టుముడతాయి. పాత కేసులు తెరపైకి వస్తాయి. ఇటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. ఏమాత్రం ప్రతికూల వ్యాఖ్యలు చేసినా జగన్ ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొంటారు. ఇది ఆయనకు తెలియంది కాదు. అందుకే కేంద్ర బడ్జెట్ పై జగన్ నోరు తెరవ లేకపోయారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు. రేపు జంతర్ మంతర్ వద్ద ఏపీలో శాంతిభద్రతలు క్షీణించడం పై ఆందోళన చేయనున్నారు. కానీ అదే టిడిపి భాగస్వామ్యంగా కేంద్రంలో నడుస్తున్న.. ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం విశేషం.

    * ఏపీకి ప్రాధాన్యం
    ఏపీకి గతంలో ఎన్నడూ లేనంతగా కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. అమరావతి రాజధాని నిర్మాణానికి ఏకంగా 15 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. పోలవరం నిర్మాణానికి సైతం చివరి వరకు సాయం చేస్తామని ప్రకటించింది. వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయిస్తామని చెప్పింది. పూర్యోదయ ప్రాజెక్టు కింద కీలక నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామని చెప్పుకొచ్చింది. దీనిని వైసీపీ ఆహ్వానిస్తే.. తన వైఫల్యాన్ని తానే ఒప్పుకున్నట్టే. పైగా చంద్రబాబు సర్కార్ కు మెచ్చుకున్నట్టే. అందుకే జగన్ మౌనంగా ఉన్నారు. వైసీపీ నేతలు సైతం బడ్జెట్ పై స్పందించడం లేదు.

    * విమర్శలు వస్తాయని భయం
    గత ఐదు సంవత్సరాలుగా కేంద్రం బడ్జెట్లను ప్రవేశపెట్టింది. కానీ ఎన్నడూ ఏపీకి ఆశాజనకంగా కేటాయింపులు చేయలేదు. విభజన హామీలకు పరిష్కారం దొరకలేదు. అమరావతి రాజధాని అంశం తేలలేదు. మూడు రాజధానుల అంశం పట్టాలెక్కలేదు. ఎంతవరకు వార్షిక రుణ పరిమితి పెంపు వరకే మినహాయింపులు దక్కేవి. అంతకుమించి జగన్ సర్కార్ సాధించిన విజయాలు లేవు. ఇటువంటి సమయంలో కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై మాట్లాడితే.. టిడిపి కూటమి క్యాష్ చేసుకుంటుంది. అందుకే జగన్ మౌనంగా ఉన్నారు. బడ్జెట్ పై మాట్లాడలేకపోతున్నారు. ఒక్క మాటంటే ఒక్క మాట అనలేకపోతున్నారు.