Bothsa Sathyanarayana :బొత్సను రంగంలో దించిన జగన్.. దక్కుతుందా విజయం?

ఇంకా ఓటమి నుంచి తేరుకోలేదు వైసిపి. మరో ఎన్నిక వచ్చి పడింది. వైసిపి పోటీ చేయక తప్పని పరిస్థితి. బరిలో దిగమంటే నేతలు భయపడిపోతున్నారు. అందుకే జగన్ సీనియర్ నేతను రంగంలోకి దించారు.

Written By: Dharma, Updated On : August 2, 2024 2:44 pm
Follow us on

Bothsa Sathyanarayana : సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఆ ఓటమి బాధ నుంచి ఇంకా తేరుకోక ముందే మరో ఎన్నిక వచ్చి పడింది. పోటీ చేయక తప్పని పరిస్థితి ఎదురైంది.దీంతో సర్వశక్తులు ఒడ్డాలని వైసిపి నిర్ణయించుకుంది. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఎన్నికల కు ముందు వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేనలో చేరారు. దీంతో ఆయనపై వైసీపీ అనర్హత వేటు వేయించింది. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అది వైసీపీ స్థానం కావడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉండడంతో పోటీ చేయాలని వైసిపి నిర్ణయించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు అవుతున్న నేపథ్యంలో.. ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు నేతలు ముందుకు రాని పరిస్థితి. విశాఖ జిల్లాకు చెందిన తాజా మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు లో ఒకరిని బరిలో దించుతారని ప్రచారం జరిగింది. అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన గుడివాడ అమర్నాథ్కు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కింది. కానీ ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదు. గాజువాక కేటాయించారు. కానీ ఆయనపై టిడిపి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ ఏకపక్ష విజయం సొంతం చేసుకున్నారు.మరోవైపు మాడుగుల ఎమ్మెల్యేగా ఉన్న బూడి ముత్యాల నాయుడు ను క్యాబినెట్ లోకి తీసుకున్నారు జగన్. ఏకంగా డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టారు. కానీ ఈసారిఆయనతో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించారు. భారీ ఓటమి తప్పలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ముంచుకు రావడంతో.. ఆ ఇద్దరు నేతల అభిప్రాయాలను తీసుకున్నారు జగన్. కానీ ఇద్దరూ విముఖత చూపినట్లు సమాచారం.

* వైసీపీకి ఏకపక్ష మెజారిటీ
ప్రస్తుతం విశాఖ జిల్లాలో స్థానిక సంస్థలకు సంబంధించి వైసీపీకి ఏకపక్ష మెజారిటీ ఉంది. మొత్తం 841 ఓట్లు ఉన్నాయి. ఓ 11 స్థానాల్లో మాత్రం ఖాళీలు ఉన్నాయి. వైసీపీకి 615 మంది సభ్యుల బలం ఉంది. టిడిపి కూటమి బలం కేవలం 215 ఓట్లు మాత్రమే. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, అనకాపల్లి,ఎలమంచిలి, భీమిలి, నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, అన్ని మండలాల జడ్పిటిసిలు, ఎంపీటీసీలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.ఈ లెక్కన వైసిపి విజయం నల్లేరు మీద నడకే.కానీ స్థానిక సంస్థల ప్రతినిధులు ఎటు నిలబడతారన్నది తెలియడం లేదు.

* వలసలతో కూటమికి బలం
ఎన్నికలకు ముందు చాలామంది స్థానిక ప్రజాప్రతినిధులు కూటమి వైపు మొగ్గు చూపారు.కూటమికి అనుకూలంగా ప్రచారం చేశారు. అధికారికంగా చేరిన వారు ఉన్నారు. సానుభూతి వ్యక్తం చేసిన వారు ఉన్నారు. మరికొందరు అధికార పార్టీ ప్రతినిధులు సైలెంట్ కూడా అయ్యారు. ఈ తరుణంలో వారంతా వైసీపీ అభ్యర్థికి ఓటు వేస్తారా? లేదా? అన్నది అనుమానమే. గ్రేటర్ విశాఖలో 12 మంది కార్పొరేటర్లు ఇటీవల టిడిపి,జనసేనలో చేరారు. మరికొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.ఇప్పటికే భీమిలి,నర్సీపట్నం, అనకాపల్లి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున స్థానిక సంస్థల ప్రతినిధులు కూటమిలోకి వచ్చారు. అందుకే స్థానిక వైసీపీ నేతలు పోటీ చేసేందుకు భయపడుతున్నారు.

* ఎట్టకేలకు అభ్యర్థి ఖరారు
అయితే బలం ఉన్నచోట అభ్యర్థిని పెట్టకపోతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని జగన్ కు తెలుసు. అందుకే సీనియర్ నేత,మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ను జగన్ రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. విశాఖకు చెందిన కార్పొరేటర్లు, స్థానికసంస్థల ప్రతినిధులు ప్రత్యేక బస్సుల్లో తాడేపల్లికి వెళ్లారు.జగన్ వారితో కీలక చర్చలు జరిపారు. విశాఖ పార్టీ నేతలతో సమావేశమై.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేశారు. వెంటనే గెలుపు ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు. మొత్తానికి అయితే జగన్ గట్టి వ్యూహమే రూపొందించారు. దానిని కూటమి ప్రభుత్వం ఎలా చేధిస్తుందో చూడాలి.