Wayanad Landslide: దేవభూమి కేరళపై ప్రకృతి ప్రకోపిస్తోంది. నాలుగేళ్ల క్రితం వరదలు విలయం సృష్టించాయి. దీంతో వందల మంది మరణించారు. తర్వాత వైరస్‌లు దాడిచేశాయి. కోవిడ్, బర్డ్‌ఫ్లూ, స్వైన్‌ఫ్లూ, నిఫా తదితర వైరస్‌లు కూడా కేరళపైనే ఎక్కువ ప్రభావం చూపాయి. తాజాగా వాయనాడ్‌పై ప్రకృతి కన్నెర్రజేసింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడడంతో వందల మంది సమాధి అయ్యారు. ఇళ్లపై భారీ బండరాళ్లు, మట్టి కూరుకుపోవడంతో సజీవ సమాధి అయ్యారు. మూడు రోజుల క్రితం ఘటన జరుగగా… సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. ప్రాణాలతో బయటపడినవారు లేదా మృతదేహాల కోసం ధ్వంసమైన ఇళ్లు మరియు భవనాలను వెతుకుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 190 మంది మరణించగా, అనధికారికంగా 275 మందికిపైగా మరణించినట్లు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్‌లో స్థానిక సిబ్బందితోపాటు ఆర్మీ కూడా దిగింది. ప్రాణాలతో ఉన్నవారికి వీలైనంత త్వరగా బయటకు తీసి ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇక మృతదేహాల గుర్తింపు కోసం పోలీసులు డాగ్‌స్క్వాడ్‌ను రంగంలోకి దించారు.
శవాల దిబ్బలు..
ఇక సహాయక చర్యల్లో భాగంగా సిబ్బంది శిథిలాల కింద నుంచి వెలికి తీస్తున్న మృతదేహాలతో వాయనాడ్ శవాల దిబ్బను తలపిస్తోంది. కుళ్లిన శవాలు, అవయవాలు లేని మృతదేహాలతో అక్కడి దృశ్యాలు హృదయ విదారకంగా కనిపిస్తున్నాయి. మరో కొన్ని రోజుల్లో సహాయక చర్యలు పూర్తి చేస్తామని సీఎం పినరయ్ విజయన్ ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ధ్వంసమైన రోడ్లు, వంతెనల కారణంగా ప్రమాదకరమైన భూభాగం, భారీ పరికరాల కొరతతో సహా సవాళ్ల కలయికతో రెస్క్యూ ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడిందన్నారు. ఇళ్లు, ఇతర భవనాలపై పడిన మట్టిని, పెద్ద పెద్ద చెట్లను తొలగించడం అత్యవసర సిబ్బందికి కష్టతరం అవుతోందన్నారు. ఇక మృతుల్లో ఇప్పటి వరకు 27 మంది పిల్లలు, 76 మంది మహిళలను గుర్తించారు. ఇక ఈ ప్రమాదంలో 225 మంది గాయపడినట్లు తెలిపారు. ఎక్కువగా ముండక్కై, చూరల్‌మల ప్రాంతాల్లో ఎక్కువగా గాయపడ్డారని చెప్పారు. సహాయక చర్యలను సమన్వయం చేయడానికి నలుగురు మంత్రులతో కూడిన క్యాబినెట్ సబ్‌కమిటీని నియమించారు.
డాగ్‌స్క్వాడ్‌తో గుర్తింపు..
ఇదిలా ఉంటే.. రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించేందుకు డాగ్‌స్క్వాడ్‌ను పోలీసులు రంగంలోకి దించారు. కొన ఊపిరితో ఉన్నవారిని డాగ్ స్క్వాడ్‌తో గుర్తించి వారిని వెంటనే బయటకు తీస్తున్నారు. హుటాహుటిన ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఇక ఆచూకీలేనివారి కోసం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతూ గాలించడం అందరినీ కలచివేస్తోంది. ఇక రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జ్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు 256 శవపరీక్షలు జరిగాయని తెలిపారు. 154 మృతదేహాలను జిల్లా యంత్రాంగానికి అప్పగించామని తెలిపారు. నిలంబూరు, పోతుకల్‌లో లభించిన మృతదేహాలను కూడా వెలికితీశారని తెలిపారు.
సహాయక చర్యల్లో 1,300 మంది..
ఇదిలా ఉంటే.. వాయనాడ్ సహాయ చర్యల్లో 1,300 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. జాయింట్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌లను నిర్వహిస్తున్నారు. వర్షాలు, గాలులు, క్లిష్ట భూభాగాలను ధైర్యంగా, భారీ యంత్రాల సహాయం లేకుండా చేశారని చెప్పారు. అలాగే జిల్లాలో 91 సహాయ శిబిరాలకు 9,328 మందిని తరలించినట్లు తెలిపారు. వీరిలో చూరల్‌మల, మెప్పాడి వద్ద కొండచరియలు విరిగిపడటంతో నిరాశ్రయులైన 578 కుటుంబాలకు చెందిన 2,328 మందిని తొమ్మిది సహాయ శిబిరాలకు తరలించినట్లు ఆయన తెలిపారు.