Jagan has changed: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుణపాఠాలు నేర్చుకుంటున్నారు. ఎక్కడ వైఫల్యాలు ఎదురయ్యాయో గుర్తిస్తున్నారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వకపోతే గడ్డు పరిస్థితులు తప్పవని గుర్తించారు. అందుకే పార్టీలో వారి ప్రాధాన్యత పెంచాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి రాజశేఖర్ రెడ్డి సమకాలీకులు చాలామంది జగన్ వెంట అడుగులు వేశారు. అయితే తన తండ్రితో పని చేశారని కనీస గుర్తింపు ఇవ్వకపోవడంతో చాలామంది సీనియర్లు మనస్థాపంతో గడిపారు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఇది ప్రభావం చూపింది. అందుకే ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా అవసరం అనుకుంటే వారి వారసులకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని చూస్తున్నారు. ముఖ్యంగా తన కోటరీని పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.
చాలామంది సీనియర్లు..
కాంగ్రెస్ పార్టీని విభేదించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ). రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ సైతం కాక వికలం అవుతున్న వేళ ఆ పార్టీకి చెందిన సీనియర్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం ప్రారంభించారు. రాజశేఖర్ రెడ్డి మాదిరిగా తమకు కూడా జగన్మోహన్ రెడ్డి వద్ద సరైన ప్రాధాన్యత దక్కుతుందని భావించారు. కానీ అధికారంలోకి వచ్చిన వరకు కొంత ప్రాధాన్యత దక్కింది. వచ్చాక మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వై వి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి లాంటి వారికే ప్రాధాన్యం కల్పించారు జగన్మోహన్ రెడ్డి. కానీ తన తండ్రితో పని చేసిన ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి వంటి వారిని తీవ్ర నిర్లక్ష్యం చేశారు. పార్టీ అంటే తాను ఒక్కడినే అన్నట్టు వ్యవహరించారు. తన చరిష్మ ఉంటే చాలు ఎవరైనా గెలిచేస్తారు అని ధీమాతో ఉండేవారు. అదే 2024 ఎన్నికల్లో దారుణంగా దెబ్బతీసింది.
ఒక్కో కీలక నేత వెళ్లిపోవడంతో..
అయితే ఓటమి ఎదురైన తరువాత.. నా అనుకున్న కోటరి బద్దలైన వేళ.. ఒక్కొక్కరు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్న తరుణంలో సీనియర్లు గుర్తుకొచ్చారు జగన్మోహన్ రెడ్డికి. అందుకే ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేతకు ఎమ్మెల్సీగా పదవి ఇచ్చి.. శాసనమండలిలో ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు. బొత్స లాంటి నేత పార్టీకి కొంతవరకు రక్షగా నిలుస్తారని భావించారు. మరోవైపు ఇప్పుడు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆయనకు కట్టబెడతారని ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ఆయనకు క్యాబినెట్ ర్యాంకింగ్ హోదా ఉండడంతో.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే ప్రజల్లోకి బలంగా వెళ్లగలరని.. ఆయన వాయిస్ కు ప్రాధాన్యత ఉంటుందని జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు మంచి వ్యూహ చతురత ఉన్న ధర్మాన ప్రసాదరావుకు పార్టీ కేంద్ర కమిటీ బాధ్యతలు కట్టబెడతారని తెలుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డిలో ఈ తరహా మార్పును వైసీపీ శ్రేణులు ఆహ్వానిస్తున్నాయి.