Jagan Vs Chandrababu: జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy)చుట్టూ చంద్రబాబు ఉచ్చు బిగిస్తున్నారా? తన చేతికి మట్టి అంటకుండా జగన్మోహన్ రెడ్డిని నిర్వీర్యం చేయబోతున్నారా? వచ్చే ఎన్నికల నాటికి కేసులతో ఉక్కిరి బిక్కిరి చేస్తారా? అది కూడా కేంద్రం చేతుల మీద ఈ తతంగాన్ని నడిపిస్తారా? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఇది స్పష్టం అవుతోంది. ఇప్పటివరకు బిజెపిని నేరుగా జగన్మోహన్ రెడ్డి విమర్శించలేదు. బిజెపి హై కమాండ్ సైతం జగన్మోహన్ రెడ్డి విషయంలో అంతగా కలుగజేసుకోలేదు. అందుకే జగన్ సైతం కేంద్రంలో బిజెపి అడిగిందే తరువాయి మద్దతు తెలుపుతున్నారు. ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సైతం ఇండియా కూటమికి కాదని.. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపారు. తన రాజకీయ ప్రత్యర్థి టిడిపి ఎన్ డి ఏ లో కీలక భాగస్వామిగా ఉన్నా.. కేసుల దృష్ట్యా జగన్ ముందుచూపుతో వ్యవహరించారు. అయితే చంద్రబాబు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని పలుచన చేయాలని చూస్తున్నారు. అయితే నేరుగా తానురంగంలోకి దిగితే అది సానుభూతిగా మారి అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూర్చుతుంది. తన పని పూర్తి చేసేందుకు చంద్రబాబు ప్లాన్ చేసినట్లు ప్రచారం సాగుతోంది.
Also Read: జగన్ చేస్తున్న తప్పు అదే!
* వివేకా కేసు విచారణకు సిబిఐ సిద్ధం
తాజాగా వివేకానంద రెడ్డి( Y S Vivekananda Reddy ) హత్య విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ వ్యవహార శైలి చూస్తుంటే మాత్రం అనుమానం కలుగుతోంది. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగింది సిబిఐ. అయితే వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని చెప్పుకొచ్చింది. అయితే ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న అవినాష్ రెడ్డి ని కనీసం విచారణ చేయకుండా.. సిబిఐ దర్యాప్తు ఎలా పూర్తయింది అన్న ప్రశ్న వినిపించింది. అయితే తాజాగా మరోసారి తాము దర్యాప్తు చేసేందుకు సిద్ధమని సిబిఐ స్వచ్ఛందంగా ముందుకు రావడం మాత్రం ఆలోచించదగ్గ విషయం. కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విషయంలో కేంద్ర వైఖరి మారినందునే.. మరోసారి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణకు సిబిఐ ముందుకు వచ్చినట్లు ప్రచారం సాగుతోంది.
* ఈడీ రంగ ప్రవేశం..
మరోవైపు ఏపీలో మద్యం కుంభకోణం( liquor scam ) ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకవైపు ఏపీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం లోతైన విచారణ చేపడుతోంది. 29 మంది పై కేసులు నమోదు చేసింది. ఓ 12 మంది అరెస్ట్ కూడా జరిగింది. మిగతా వారిని అరెస్టు చేసేందుకు అన్ని ఆధారాలు సేకరిస్తోంది ప్రత్యేక దర్యాప్తు బృందం. అయితే సరిగ్గా ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలోకి దిగడం మాత్రం సంచలనంగా మారింది. దాదాపు రూ.3500 కోట్ల కుంభకోణం ఇదని ప్రచారం జరుగుతున్న వేళ కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగడం సీరియస్ నెస్ ను తెలుపుతోంది. తద్వారా జగన్మోహన్ రెడ్డి పై కేంద్రం పట్టు బిగిస్తోందని అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ఈ రెండు కేసులతో జగన్మోహన్ రెడ్డిని మరింత ఇరకాటంలో పెట్టేందుకు చంద్రబాబు ఆడుతున్న గేమ్ గా తెలుస్తోంది.
* సానుభూతి పై అంచనా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చంద్రబాబు ( CM Chandrababu)అరెస్ట్ అయ్యారు. కనీస ఆధారాలు లేని కేసులో అప్పటి వైసిపి ప్రభుత్వం చంద్రబాబును జైల్లో పెట్టించింది. ఆయన 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. ఆ సమయంలో చంద్రబాబు అరెస్టుతో విపరీతమైన సానుభూతి లభించింది. మరోసారి జగన్ మోహన్ రెడ్డి విషయంలో ఆ తప్పు జరగకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించి జగన్మోహన్ రెడ్డి అవినీతిని బయటపెట్టాలని చూస్తున్నారు. తద్వారా ప్రజల్లో చులకన చేయాలని.. అదే 2029 ఎన్నికల్లో ప్రభావం చూపుతోందని అంచనా వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.