Arab NATO latest news: ఇజ్రాయెల్ హమాస్ నాయకులపై ఖతార్ రాజధాని దొహాలో (సెప్టెంబర్ 9, 2025) చేసిన విమాన దాడి మధ్యప్రాచ్య భద్రతా సమీకరణలను గణనీయంగా మార్చింది. ఈ దాడిలో హమాస్ సీనియర్ నాయకులు, ఖతార్ భద్రతా అధికారి సహా ఐదుగురు మరణించారు, మరికొందరు గాయపడ్డారు. ఈ చర్య గాజా యుద్ధ సంధి చర్చలను దెబ్బతీసింది. ఖతార్ అమెరికా మద్దతుతో మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. దొహాలోని లెక్తైఫియా ప్రాంతంలోని రహస్య భవనాన్ని 10కి పైగా ఫైటర్ జెట్లు లక్ష్యంగా చేసి, 10 మిస్సైళ్లు ప్రయోగించారు. ఈ సంఘటన అరబ్ దేశాల్లో అమెరికా రక్షణ హామీలపై అనుమానాలు రేకెత్తించింది. ఎందుకంటే ఖతార్‌లోని అల్ ఉదైద్ అమెరికా సైనిక బేస్‌కు ఉన్నప్పటికీ, దాడిని ఆపలేదు. దీంతో అరబ్ లీగ్, ఇస్లామిక్ సహకార సంస్థలు ఐక్యంగా ఇజ్రాయెల్‌ను ఖండించాయి.
‘అరబ్ నాటో’ ఆలోచనకు పునరుజ్జీవం..
దాడి తర్వాత సెప్టెంబర్ 15, 2025న దొహాలో 50కి పైగా అరబ్–ఇస్లామిక్ దేశాల సమ్మిట్ జరిగింది. ఇక్కడ ఇజ్రాయెల్ చర్యలను ’రోగ్ స్టేట్’ ప్రవర్తనగా ఖండించి, ఐక్య ప్రతిస్పందనకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఈజిప్ట్ నుంచి ’అరబ్ నాటో’ అనే సైనిక కూటమి ఏర్పాటు ప్రతిపాదన తెచ్చింది. 2015లో మొదటిసారి ప్రతిపాదించిన ఈ ఆలోచన, ఇప్పుడు ఇజ్రాయెల్ ముప్పును ఎదుర్కొనేందుకు పునరుజ్జీవించబడింది. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తాహ్ అల్–సిసి నాయకత్వంలో, అరబ్ లీగ్ 22 దేశాల సైన్యాలను ఏకీకృతం చేసి, భూసైన్యం, వాయుసైన్యం, నావికాదళాలు, కమాండోలతో కూటమి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పాకిస్తాన్ ’అరబ్–ఇస్లామిక్ టాస్క్ ఫోర్స్’కు మద్దతు ఇచ్చి, ఇజ్రాయెల్ విస్తరణను అడ్డుకోవాలని పిలుపునిచ్చింది. ఈ కూటమి అమెరికాపై ఆధారపడడాన్ని తగ్గించి, స్వయం రక్షణను బలోపేతం చేస్తుందని నాయకులు భావిస్తున్నారు. అయితే, సార్వభౌమత్వ సమస్యలు, ప్రాంతీయ వైరుధ్యాలు మూలంగా ఇది ఇంకా రూపొందలేదు.
పాక్–సౌదీ కీలక ఒప్పందం..
ఒకవైపు అరబ్ నాటోపై చర్చలు జరుగుతుండగానే సెప్టెంబర్ 17న రియాద్‌లో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మధ్య ’స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రీమెంట్’ (ఎస్‌ఎండీఏ)పై సంతకం చేశారు. దీని ప్రకారం, ఒక దేశంపై దాడి జరిగితే రెండింటిపైనా జరిగినట్లు పరిగణించి, సమష్టిగా ఎదుర్కొంటారు. 1960 నుంచి ఉన్న ఈ సంబంధం, 1982లో భద్రతా సహకార ఒప్పందంతో బలపడింది. పాకిస్తాన్ అణు ఆయుధాలు (సుమారు 170) కలిగి ఉండటం వల్ల, సౌదీకి అణ్వస్త్రాలు అందే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. సౌదీ ఆర్థిక సహాయం (2025–26లో 6 బిలియన్ డాలర్లు)తో పాకిస్తాన్ ఆయుధాలు కొనుగోలు చేస్తుంది. ఈ ఒప్పందం ’అరబ్ నాటో’కు మొదటి దశగా కనిపిస్తోంది, ఇరాన్, హౌతీలు, ఇజ్రాయెల్ ముప్పులను ఎదుర్కొనేందుకు రూపొందింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ, మరిన్ని దేశాలు చేరే అవకాశం ఉందని, అణు నిబంధనలు లేవని స్పష్టం చేశారు.
అమెరికా అణు ఆకాంక్షలు..
సౌదీ అరేబియా, ప్రపంచంలోని అతి ధనిక దేశాల్లో ఒకటిగా, 280 ఫైటర్ జెట్లు (ఎఫ్–15, యూరోఫైటర్ తైఫూన్), పేట్రియాట్, తాడ్ క్షిపణి వ్యవస్థలు కలిగి ఉంది. అమెరికా నుంచి పూర్తి సైనిక మద్దతు పొందినప్పటికీ, ఇజ్రాయెల్ ముప్పు, అమెరికా విశ్వసనీయత తగ్గడంతో, పాకిస్తాన్‌తో ఒప్పందం చేసుకుంది. మధ్యప్రాచ్యలో అణు ఆయుధాలు లేని సౌదీ, పాకిస్తాన్ అణు సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇది ఇరాన్‌పై బెదిరింపుగా పనిచేస్తుంది. పాకిస్తాన్‌కు ఈ ఒప్పందం ఆర్థిక బలం, మధ్యప్రాచ్యలో ప్రభావం పెంచుతుంది. 1960 నుంచి ఉన్న ఈ ఆలోచన, ఇప్పుడు ఇజ్రాయెల్ చర్యలతో రూపొందుతోంది.
భారత్‌పై ప్రభావం..
ఈ ఒప్పందం భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. పాక్‌పై భారత్ చేసే ఏదైనా చర్యను సౌదీపై దాడిగా పరిగణించవచ్చు. ముఖ్యంగా పహల్గాం లాంటి ఉగ్రవాద సంఘటనల సమయంలో. 1955లో పాక్ చేరిన సీటో, సెంటో కూటములు 1965 యుద్ధంలో సహాయం చేయలేదు, కానీ ఇప్పుడు ’అరబ్ నాటో’ ఏర్పడితే పరిస్థితి మారవచ్చు. అయితే, భారత విదేశాంగ అధికారి రణధీర్ జయస్వాల్ మాట్లాడుతూ, సౌదీ భారత్‌తో ద్వైపాక్షిక ప్రయోజనాలు, సున్నితత్వాన్ని గుర్తుంచుకుంటుందని చెప్పారు. ఇదిలా ఉంటే 2025లో భారత్–సౌదీ వాణిజ్యం 41.88 బిలియన్ డాలర్లకు చేరింది. భారతీయులు 24 లక్షల మంది సౌదీలో పనిచేస్తున్నారు. ఏప్రిల్ 2025లో మోదీ సందర్శనలో డిఫెన్స్, ఎనర్జీ, స్పేస్ M్ఖౌటసంతకం అయ్యాయి. సౌదీ భారత్‌కు ఐదో పెద్ద వాణిజ్య భాగస్వామి, భారత్ సౌదీకి రెండోది. ఈ సంబంధాలు ఒప్పందాన్ని సమతుల్యం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ మార్పులు మధ్యప్రాచ్యలో అమెరికా ప్రభావాన్ని తగ్గించి, అరబ్–ఇస్లామిక్ ఐక్యతను పెంచుతున్నాయి. ‘అరబ్ నాటో’ ఏర్పడితే, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సమతుల్యత మారవచ్చు, కానీ అంతర్గత వైరుధ్యాలు అడ్డంకిగా నిలుస్తాయి. భారత్‌కు, పాక్–సౌదీ ఒప్పందం ఉగ్రవాద ప్రతిస్పందనల్లో సంక్లిష్టతలు తెచ్చవచ్చు, కానీ ఆర్థిక సంబంధాల ద్వారా సమతుల్యం చేసుకోవచ్చు. దీర్ఘకాలంగా, ఈ మార్పులు గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లు, భారత్–అమెరికా భద్రతా సహకారాన్ని ప్రభావితం చేస్తాయి.