Early Elections In AP : ముందస్తు ఎన్నికలకు జగన్.. ఏపీలో ఏం జరుగుతోంది

దీనికి జగన్ సైతం అనుకూలంగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అంతకు మించితే మాత్రం విపక్షాల మధ్య ఐక్యత, సీట్ల సర్దుబాట్లతో ఒక రకమైన అనుకూల వాతవరణం ఏర్పడుతుందని.. అది అంతిమంగా తనకు చేటు తెస్తుందని జగన్ ఆందోళన చెందుతున్నారు. అందుకే ముందస్తుకు సీరియస్ గా ఆలోచన చేస్తున్నారు. 

Written By: Dharma, Updated On : May 29, 2023 9:08 am
Follow us on

Early Elections In AP :  ఏపీ సీఎం జగన్ ముందస్తుకు మొగ్గుచూపుతున్నారా? ప్రజావ్యతిరేకతను ఎదుర్కోవాలంటే అదే సరైన నిర్ణయమని భావిస్తున్నారా? విపక్షాలకు అవకాశం ఇవ్వకూడదని చూస్తున్నారా? అక్టోబరులో అసెంబ్లీని రద్దు చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. నీతిఆయోగ్ సమావేశానికి అంటూ సీఎం జగన్ ఒక రోజు ముందుగానే ఢిల్లీ పయనమయ్యారు. దీని వెనుక పక్కా పొలిటికల్ అజెండా ఉందన్న అనుమానాలున్నాయి. ముందస్తు ఎన్నికల కోసమే కేంద్ర పెద్దలు కలిసినట్టు ప్రచారం జరుగుతోంది.

రాష్ట్రం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ తరుణంలో కేంద్ర పెద్దలు జగన్ సర్కారుపై దయతలిచారు. చంద్రబాబు హయాం నాటి రెవెన్యూలోటు కింద రూ.10 వేల కోట్లు సాయం అందించారు. ఈ నగదుతో అక్టోబరు వరకూ సంక్షేమ పథకాలు అమలుచేసి ఎన్నికలకు వెళ్లాలన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏప్రిల్‌-మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. అంటే అక్టోబరు నుంచి కనీసం ఆరు నెలల సమయం పడుతోంది. మరిన్ని పథకాలు కొనసాగించాల్సి ఉంటుంది. అందుకే ముందస్తుకే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణతో పాటు డిసెంబరులో ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందని జగన్‌ తీవ్రంగా ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. విపక్షాల ఊహకు అందని విధంగా అక్టోబరులో అసెంబ్లీని రద్దుచేసి నవంబరులో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించేలా చేసి డిసెంబరులో ఎన్నికలకు వెళ్లే దిశగా ఆయన పథకం సిద్ధం చేసుకున్నారని.. ఇందుకు అవసరమైన సాంకేతిక అంశాలన్నింటిపైనా ఢిల్లీ ముఖ్యులతో మంతనాలు జరిపి.. అన్నీ ఖరారు చేసుకున్నాకే ఈ నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఇప్పుడు అదే అజెండాతో ఢిల్లీ వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ ఏడాదిలో కీలక రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరులో  తెలంగాణ, మిజోరం, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్గఢ్‌ రాష్ట్రాలకు ఎన్నికలు జరగాలి. వీటితోపాటే ఏపీకి కూడా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందని కసరత్తు చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం శాసనసభ గడువుకు ఆరు నెలల కంటే ముందే నోటిఫికేషన్‌ ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి ఆ ఐదు రాష్ట్రాలతోపాటే ఎన్నికలకు వెళ్లాలంటే ఏపీ అసెంబ్లీని గడువుకన్నా ముందే.. అక్టోబరులోనే రద్దుచేయాలి. ఆ తర్వాత నవంబరులో ఆ ఐదు రాష్ట్రాలతో కలిపి ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇస్తారని.. డిసెంబరులో ఎన్నికలు నిర్వహించవచ్చని నిపుణులు జగన్‌కు సూచించినట్లు తెలిసింది. దీనికి జగన్ సైతం అనుకూలంగా ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అంతకు మించితే మాత్రం విపక్షాల మధ్య ఐక్యత, సీట్ల సర్దుబాట్లతో ఒక రకమైన అనుకూల వాతవరణం ఏర్పడుతుందని.. అది అంతిమంగా తనకు చేటు తెస్తుందని జగన్ ఆందోళన చెందుతున్నారు. అందుకే ముందస్తుకు సీరియస్ గా ఆలోచన చేస్తున్నారు.