Jagan And Chandrababu: పండిత పుత్ర.. పరమ శుం.. అనే ఒక సామెత ఉంటుంది. ఆయన పండితుడే.. కుమారుడుకు మాత్రమే అది అబ్బలేదు. రాజకీయాల్లో కూడా ఇది వర్తిస్తుంది. చాలామంది తమ పిల్లలను రాజకీయ వారసులుగా ప్రకటించారు. కానీ వారు అనుకున్నది సాధించలేకపోయారు. అయితే మరి కొంతమంది మాత్రం చాలా సక్సెస్ అయ్యారు. అలా రాణించిన వారిలో జగన్మోహన్ రెడ్డి, నారా లోకేష్, కింజరాపు రామ్మోహన్ నాయుడు వంటి వారు ఉన్నారు. అయితే తండ్రి వారసత్వంగా కొన్ని అంశాలను కొనసాగిస్తూ వచ్చారు. అయితే తండ్రి మరణంతో వచ్చిన సానుభూతి ద్వారా ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి. కానీ తండ్రి మాదిరిగా రెండోసారి అధికారంలోకి రాలేకపోయారు. ఆపై రాజశేఖరరెడ్డి( Y S Rajasekhara Reddy ) వద్ద ఉన్నది.. జగన్మోహన్ రెడ్డి దగ్గర లేనిది ఒకటి ఉంది. ఆయన సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేశారు. కానీ జగన్ మాత్రం సంక్షేమం అంటూ పాకులాడారు. చేతులు కాల్చుకున్నారు.
* బలమైన సైన్యం ఉన్నా..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి బలమైన సోషల్ మీడియా సైన్యం ఉంది. ఆపై ఐప్యాక్ టీం సేవలందిస్తోంది. కానీ గత ఐదేళ్ల వైసిపి పాలనలో రాజకీయ ప్రత్యర్థులపై ఈ సైన్యమంతా విరుచుకుపడింది. జగన్మోహన్ రెడ్డి పై ఈగ వాలనిచ్చేది కాదు. రాజకీయంగా ప్రచారానికి మాత్రమే ఈ సైన్యమంతా దోహద పడింది. కానీ జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, ఇతరత్రా అంశాలను మాత్రం ప్రచారం చేయలేకపోయింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని రకాల చట్టాలను రూపొందించింది. దిశ వంటి యాప్ రూపకల్పనలో ముందుండడమే కాదు.. ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది. కానీ అటువంటివేవీ ప్రచారం చేసుకోలేకపోయింది. కొన్ని రకాల నిర్మాణాలు, అభివృద్ధి పనులు చేపట్టింది. కానీ వాటిని ప్రచారం చేసుకోలేకపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే పథకాలు ఇచ్చాం.. ప్రత్యర్థులపై విరుచుకుపడతాం.. అన్నట్టు సాగేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యవహారం.
* వ్యూహం ప్రకారం చంద్రబాబు..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు( CM Chandrababu) ఒక వ్యూహం ప్రకారం ముందుకు సాగుతున్నారు. తొలి మూడు నెలలు పాలనాపరమైన వ్యవహారాలపై దృష్టి పెట్టారు. అక్కడ నుంచి రంగంలోకి దిగారు. అమరావతి రాజధానిని ప్రాధాన్యత అంశంగా తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రాధాన్యమిచ్చారు. ఏడాది తరువాత ప్రజల్లో చిన్నపాటి అసంతృప్తి వ్యక్తం అవుతున్న తరుణంలో.. సంక్షేమ పథకాలను అమలు చేయడం ప్రారంభించారు. వాటిని తమ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. తనకు మద్దతునిచ్చే అనుకూల మీడియాలో ఒక తరహాలో ప్రచారం చేసి ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రయత్నించడం నిజం. వైద్య విద్యను అభ్యసించే పేదల కోసమే ఆ ప్రయత్నం చేశారు. కానీ టిడిపి కూటమి మెడికల్ కాలేజీల నిర్వహణకు సంబంధించి పిపిపి విధానం ప్రకటించే వరకు ఈ విషయం జనాలకు తెలియదు. అప్పట్లో దానిపై ప్రచారం చేసుకోలేదు కూడా. దానికి కారణం ఆ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని సరైన రీతిలో పూర్తి చేయకపోవడమే. అయితే ఇప్పుడు అదే మెడికల్ కాలేజీలపై వివాదం ఏర్పడడంతో.. ఆ కాలేజీల వద్దకు వెళ్లి.. ఫోటోలు తీసి.
. మీడియా మీట్ లు నిర్వహించాలని జగన్ ఆదేశించారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆశ్చర్యపోయారు. ఎంతటి మంచి నిర్ణయాన్ని అప్పట్లో ఎందుకు ప్రచారం చేసుకోలేకపోయామా? అని వారు సైతం ఆశ్చర్యపోతున్నారు. అవే మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని కొనసాగిస్తూ ప్రచారం చేసుకుంటే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వచ్చేది. కానీ జగన్ ఆ పని చేయలేదు. అయితే ఇప్పుడు ప్రతి నిర్మాణాన్ని, ప్రతి అభివృద్ధి పనిని ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబుకు మధ్య ఉన్న తేడా అదే.