Chandrababu-YS Jagan : చంద్రబాబులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గత అనుభవాల దృష్ట్యా ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్న బాబు సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో చంద్రబాబు చుట్టూ ఒక కోటరీ ఉండేదని ప్రచారం నడిచింది. అప్పట్లో చంద్రబాబు అపాయింట్మెంట్ ప్రహసనంగా ఉండేదని టాక్ ఉండేది. ఎమ్మెల్యేలు కలవాలంటే ఇబ్బందికరంగా ఉండేదని ప్రచారం జరిగింది. అయితే ఈసారి అటువంటి పరిస్థితి ఉండకుండా చూసుకుంటున్నారు చంద్రబాబు. ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ అడిగితే సీఎంవో నుంచి వెంటనే రిప్లై వస్తోంది. అవకాశం ఉన్న ఎమ్మెల్యేలు నేరుగా చంద్రబాబును కలుసుకుంటున్నారు. అసెంబ్లీలో చంద్రబాబు అన్ని రోజులపాటు ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉన్నారు. అక్కడ అపాయింట్మెంట్ లేకుండా నేరుగా వెళ్లి తమ నియోజకవర్గాలకు కావలసిన పనులు, పరిష్కరించాల్సిన సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చారు. కొన్ని పనులకు భరోసా తెచ్చుకున్నారు. మరికొన్ని పనులకు ఆదేశాలు తెచ్చుకున్నారు.
* జగన్ ను కలవడం అంటే కష్టం
గత ఐదేళ్ల వైసిపి హయాంలో ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఎమ్మెల్యేలను కలిసేందుకు జగన్ పెద్దగా ఇష్టపడేవారు కాదు. చివరకు మంత్రులు సైతం కలవలేని పరిస్థితి. ఎన్నికల సమయంలో డిప్యూటీ సీఎం గా పని చేసిన రాజన్న దొర ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఆయనకు ఎమ్మెల్యే కంటే ఎంపీగా పోటీ చేయాలని ఉండేది. కానీ జగన్ మాత్రం ఆయనకు సాలూరు అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చారు. అయితే మంత్రిగా, డిప్యూటీ సీఎం గా ఉన్న ఆయన జగన్ ను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ అపాయింట్మెంట్ లభించలేదు. అయితే ఈ విషయాన్ని ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రస్తావించారు రాజన్న దొర. సీఎం జగన్ కలిసేందుకు ప్రయత్నించిన అపాయింట్మెంట్ దొరకలేదని.. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. అయితే జగన్ విషయంలో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఆయనను కలవాలంటే ముందుగా ఆ నలుగురిని కలవాలి. వారిని కన్వెన్షన్ చేయాలి. అటు తరువాతే వారిని కలిసేందుకు అనుమతి వస్తుంది. లేకుంటే అంతే. గత ఐదేళ్లుగా 151 మంది ఎమ్మెల్యేలను వర్క్ షాపుల్లో మాత్రమే కలిశారు జగన్. అదే సమయంలో నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభల్లో సైతం ఎమ్మెల్యేలకు సరైన గౌరవం దక్కిన పరిస్థితి ఉండేది కాదు.
* మూడు పార్టీల ఎమ్మెల్యేలను కలుపుకెళ్తూ
ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నడుస్తోంది.కూటమి 164 సీట్లలో విజయం సాధించింది. అయితే వీరందరినీ కోఆర్డినేట్ చేసుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అవుతున్నారు. వేరు వేరు పార్టీలకు చెందిన ఈ ఎమ్మెల్యేలు అధినేత చంద్రబాబు అన్నంత మాదిరిగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో వారు అపాయింట్మెంట్ కోరితే సమయం ఇస్తున్నారు చంద్రబాబు. ఎక్కడా సమన్వయం చెదిరిపోకుండా.. విభేదాలకు అవకాశం ఇవ్వకుండా చంద్రబాబు ముందుకు సాగుతూ ఉండడంతో ఎమ్మెల్యేలు సైతం సంతోషపడుతున్నారు.