Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan: జగన్ ఢిల్లీ టూర్ మిస్టరీ

CM Jagan: జగన్ ఢిల్లీ టూర్ మిస్టరీ

CM Jagan: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు? హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఎందుకు కోరారు? రాజకీయ ప్రయోజనాల కోసం? లేకుంటే కేసుల విషయంలో మాట్లాడేందుకా? ఇది కాకుండా ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఎన్నికలకు పట్టుమని రెండు నెలల వ్యవధి కూడా లేదు. ఏ క్షణం అయినా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జగన్ అమిత్ షాను కలిసేందుకు ప్రయత్నించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ రెండు నెలల్లో కీలకమైన సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల అభిమానాన్ని చూరగొనాలని జగన్ భావిస్తున్నారు. వాటితో పాటు ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు సంబంధించి బిల్లులు, వైసిపి కిందిస్థాయి నేతలకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు.. ఇలా అన్నింటికీ భారీ మొత్తంలో నిధులు అవసరం. వైసీపీలో కిందిస్థాయి నేతలు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలువంటి వాటిని నిర్మించారు. వీటితో పాటు రహదారులు, కాలువల నిర్మాణం చేపట్టారు. వీటన్నింటికీ వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వీటిని చెల్లించకుండా ఎన్నికలకు వెళ్తే ప్రతికూల ఫలితాలు వస్తాయని జగన్ భయపడుతున్నారు. అటు వైసీపీ ఎమ్మెల్యేలు సైతం పదేపదే బిల్లుల విషయమై జగన్ కు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రుణ పరిమితి పెంచుకొని.. వివిధ పద్ధతుల ద్వారా నిధుల సేకరణకు జగన్ ఢిల్లీ బాట పడుతున్నట్లు తెలిసింది.

గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇదే మాదిరిగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2019 ఎన్నికల ముందు నాటికి చాలామంది టిడిపి నాయకులు వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. నీరు చెట్టు వంటి పథకం ద్వారా చేపట్టిన పనులకు చంద్రబాబు బిల్లులు చెల్లించలేదు. మరోసారి తామే అధికారంలోకి వస్తాం అన్న ధీమాతో చెల్లింపుల విషయంలో జాప్యం చేశారు. కొంత చెల్లింపులు చేస్తామనగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికల్లో టిడిపికి ఓటమి ఎదురైంది. దీంతో బిల్లుల చెల్లింపు లేకుండా పోయింది. కోర్టులకు వెళ్ళినా.. రకరకాల కారణాలు చూపుతూ జగన్ సర్కార్ బిల్లులు చెల్లించలేదు. ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీ నేతలకు రాకుండా చూసేందుకే జగన్ ఢిల్లీ వెళుతున్నట్లు సమాచారం. ఏదో మూలంగా కేంద్రాన్ని ఒప్పించి నిధులు విడుదలకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే అమిత్ షా అపాయింట్మెంట్ ను తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఎల్లో మీడియా మాత్రం రాజ్యసభ ఎన్నికలు, షర్మిల ఎంట్రీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సాయాన్ని ఇచ్చిపుచ్చుకోవడం వంటి కథనాలను వండి వార్చుతోంది. కానీ అసలు విషయం నిధుల వేటకేనని తెలుస్తోంది. అయితే అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular