Bhakshak Trailer: భూమిఫడ్నేకర్.. ముందు యష్ రాజ్ ఫిలిమ్స్ లో దర్శకత్వం విభాగంలో పనిచేసింది. ఆ తర్వాత నటి అయింది. బొద్దుగా ఉన్నప్పటికీ చాలెంజింగ్ పాత్రలు చేసి బాలీవుడ్ లో పేరొందిన నటిగా నిలిచింది. అంగాంగ ప్రదర్శన చేసే బాలీవుడ్ లో.. ఎటువంటి స్కిన్ షో చేయకుండానే అభిమానులను అలరించవచ్చని నిరూపించింది. అలాంటి భూమిఫడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భక్షక్. బాలీవుడ్ ఎన్నో అంచనాలను పెట్టుకున్న చిత్రం ట్రైలర్ బుధవారం విడుదలైంది. అయితే ఈ సినిమా నేరుగా థియేటర్లో కాకుండా నెట్ ఫ్లిక్స్ లో విడుదలవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్, అతడి భార్య గౌరీఖాన్ సంయుక్తంగా రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంతకీ ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందంటే..
ఈ చిత్రం ట్రైలర్ గమనిస్తే.. ఉత్తర భారతంలోని ఓ నగరంలో వసతి గృహాల్లో అనాధ అమ్మాయిలు తలదాచుకుంటారు. ఆ అమ్మాయిల్లో కొందరు అత్యాచారానికి గురవుతుంటారు. ఈ దుర్మార్గం వెనక ఓ లోకల్ రౌడీ ఉంటాడు. అతడు ఒక మాఫియాను నడిపిస్తుంటాడు. ఆ మాఫియాలోని వ్యక్తులు ఆ అనాధ అమ్మాయిలపై అత్యాచారం చేస్తుంటారు. అయితే ఈ దారుణాన్ని బయట ప్రపంచానికి తెలియజేసే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు వైశాలి ( భూమిఫడ్నేకర్) పాత్రలో కనిపించనుంది.. ఆ అనాధ బాలికలపై, మహిళలపై అత్యాచారాలను వైశాలి ఎలా గుర్తించింది? వాటిని ఆధారాలతో సహా ఎలా బయట పెట్టింది? ఈ నేపథ్యంలో ఆమెకు ఎదురైన సవాళ్లు ఎటువంటివి? అనేవి తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే అని చిత్ర యూనిట్ చెప్తోంది.
పులకిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సంజయ్ మిశ్రా, ఆదిత్య శ్రీ వాస్తవ, సాయి తమ్ హంకర్ వంటి నటులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 9న నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ప్రీమియర్ కానుంది. చిత్ర విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో నిర్మాణ సంస్థ ప్రమోషన్స్ లో వేగం పెంచింది. ఇక ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచింది. ట్రైలర్ విడుదల చేసిన గంటలోపే లక్ష వ్యూస్ నమోదు చేసుకుంది.