Jagan: ఏపీలో ఎన్నికల ఘట్టం ముగిసింది. గెలుపు పై అన్ని పార్టీలు ధీమాతో ఉన్నాయి. 13వ తేదీన పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. జూన్ 4న ఫలితాలు ప్రకటించనున్నారు. అప్పటివరకు ఈ ఉత్కంఠ తప్పదు. అయితే సాలిడ్ విజయం అందుకుంటామని జగన్ ప్రకటించారు. ఐ ప్యాక్ కార్యాలయంలో 151 అసెంబ్లీ, 22 కు పైగా పార్లమెంట్ సీట్లను దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సీనియర్లలో మాత్రం ఈ ధీమా కనిపించడం లేదు. పార్టీ శ్రేణుల్లో ఆ స్థాయిలో నమ్మకం కనిపించడం లేదు. అయితే కొందరు మంత్రులు మాత్రం కీలక ప్రకటనలు చేస్తున్నారు.
వైసీపీ అధికారంలోకి వస్తుందని.. జూన్ 9న విశాఖలో జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి బొత్స ప్రకటించారు. ఫలితాల ప్రకటన తర్వాత ఏర్పాటు చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. అయితే మొన్నటి వరకు ప్రభుత్వ వ్యవహారాలు, ఎన్నికల నిర్వహణలో క్షణం తీరిక లేకుండా గడిపిన సీఎం జగన్ రెండు వారాలు పాటు విదేశీ పర్యటనకు వెళ్లారు. భార్య భారతి తో కలిసి యూరప్ లో పర్యటించనున్నారు. జూన్ 1న జగన్ దంపతులు రాష్ట్రానికి తిరిగి రానున్నారు. ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత పర్యటనగా తెలుస్తోంది.
ముందుగా జగన్ దంపతులు లండన్ వెళ్ళనున్నారు. అక్కడ కుమార్తెలను కలవనున్నారు. అనంతరం స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో జగన్ కుటుంబం గడపనున్నారు. అక్కడ నుంచి జూన్ ఒకటిన వారు తిరుగు ముఖం పట్టనున్నారు. విదేశీ పర్యటనకు బయలుదేరిన సీఎం జగన్ దంపతులకు గన్నవరం విమానాశ్రయంలో నేతలు వీడ్కోలు పలికారు. జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, నందిగాం సురేష్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సామినేని ఉదయభాను, తలసిల రఘురాం, మొండితోక అరుణ్ కుమార్, మల్లాది విష్ణు తదితరులు విమానాశ్రయంలో జగన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వీడ్కోలు పలికారు.