Jagan: జగన్మోహన్ రెడ్డిలో( Y S Jagan Mohan Reddy ) స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. పోయిన చోటే వెతుక్కోవాలని ఆయన భావిస్తున్నారు.. ఏ వర్గానికి ఆయన వ్యతిరేకమయ్యారు గుర్తించారు. వారికి దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది అంత ఈజీ కాదు. జగన్మోహన్ రెడ్డి పాలనను ఇప్పటికీ గుర్తుచేసుకొని చాలామంది భయపడుతుంటారు. అలాగని వారు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేని వారు. ఒక విధంగా చెప్పాలంటే తటస్థులు. జగన్ సర్కార్ హయాంలో చాలా రకాల నిర్ణయాలు వారిపై ప్రభావం చూపాయి. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గుణపాఠాలుగా నేర్చుకుని వారి విషయంలో సానుభూతి ప్రకటనలు చేస్తున్నారు. కానీ వారు మాత్రం జగన్మోహన్ రెడ్డిని నమ్మడం లేదు.
* మీడియా ముందు సమస్యలు..
జగన్మోహన్ రెడ్డి శాసనసభకు హాజరు కావడం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వనందున బాయ్ కట్ చేశారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే మైక్ దక్కుతుందని.. గంటల తరబడి మాట్లాడే అవకాశం వస్తుందని చెబుతున్నారు. అధికారపక్షం ఇవ్వనందునే శాసనసభకు వెళ్లడం లేదని సాకుగా చెప్పుకొస్తున్నారు. దాని బదులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. నిన్ననే మీడియా ముందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. చాలా విషయాలపై మాట్లాడే క్రమంలో ఆ ముగ్గురు నేతలపై అదే పనిగా విమర్శలు చేశారు. చంద్రబాబును ప్రధానంగా టార్గెట్ చేసుకుని.. పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ పై నిశిత విమర్శలు చేశారు.
* జగన్ ప్రత్యేక ప్రస్తావన..
అయితే జగన్మోహన్ రెడ్డి గతానికి భిన్నంగా వ్యవహరించారు ఒక వర్గంపై. ఉద్యోగుల సమస్యలపై మాట్లాడారు. వారికి డిఎ ఇవ్వని విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని విమర్శించారు. ఎన్నికల్లో చాలా రకాల హామీలు ఇచ్చారని.. కనీసం వాటి గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలపై తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. అయితే సడన్గా ఉద్యోగుల విషయంలో జగన్మోహన్ రెడ్డి వైఖరి మారడంపై ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. అంతకు ముందు పాలించిన జగన్మోహన్ రెడ్డియేనా? అని అనుమానం పడేలా ఉద్యోగులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జగన్ సర్కారులో ఎదురైన పరిణామాలను గుర్తు చేసుకున్నారు.
* మరిచిపోలేకపోతున్న ఉద్యోగులు..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఉద్యోగులకు ఎదురైన పరిణామాలు తెలుసు. వారి విషయంలో జగన్ ఎలా వ్యవహరించారో కూడా ఆ వర్గానికి తెలుసు. ఉద్యోగుల సమస్యలపై మాట్లాడే అప్పటి మంత్రులు వ్యవహరించిన తీరు తెలుసు. ఒకటో తారీఖున అందాల్సిన జీతం నాలుగో వారంలో అందడం కూడా తెలుసు. మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను నియమించడం తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి తమ సమస్యల పట్ల మాట్లాడేసరికి ఆశ్చర్య పోవడం ఉద్యోగుల వంతు అయింది. తమ విషయంలో జగన్మోహన్ రెడ్డి గుణపాఠాలు నేర్చుకోవడం మంచిదే అయినా.. ఆయన తమ పట్ల వ్యవహరించిన తీరును మాత్రం మరిచిపోలేకపోతున్నారు ఉద్యోగులు.