Jagan Padayatra 2025: వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) పాదయాత్ర చేయనున్నారు. 2027 ద్వితీయార్థంలో పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. అంతకంటే ముందే జిల్లాల పర్యటన పూర్తి చేయనున్నారు. పార్టీ ప్లీనరీ సైతం నిర్వహించి పాదయాత్రకు దిగనున్నారు. అంతవరకు ఒకే కానీ ఆయన పాదయాత్ర మునుపటిలా సాగుతుందా? అన్నది అనుమానమే. ఎందుకంటే మొన్న లోకేష్ పాదయాత్ర ఎంతలా ఇబ్బంది పడిందో తెలియనిది కాదు. దారి పొడవునా అడ్డంకులు సృష్టించారు. నిలదీతలతో పాటు అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. వైసిపి సోషల్ మీడియా సైన్యం ఒకవైపు, ఐప్యాక్ టీం మరోవైపు పాదయాత్రకు భంగం కలిగించేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. అటువంటి పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తప్పేలా లేదు. ఎందుకంటే రాజకీయాల్లో విమర్శలపై ప్రతి విమర్శలు ఉంటాయి. లోకేష్ పాదయాత్రలో ఎదురైన పరిణామాలు.. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు తప్పవు కూడా.
* ఆ ఘనత రాజశేఖర్ రెడ్డిది
దేశంలో పాదయాత్రలకు దిక్సూచి అయ్యారు వైయస్ రాజశేఖర్ రెడ్డి( y s Rajasekhar Reddy ). ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పాదయాత్ర చేశారు. 1500 కిలోమీటర్లు నడిచి కాంగ్రెస్ పార్టీని ఏపీలో అధికారంలోకి తీసుకొచ్చారు. కేంద్రంలో సైతం కాంగ్రెస్ పార్టీకి ఊపిరి ఊదారు రాజశేఖరరెడ్డి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆయన వారసుడిగా ముఖ్యమంత్రి పదవి కోరుకున్నారు. ఇవ్వక పోయేసరికి సొంతంగా ఒక పార్టీని ఏర్పాటు చేసి అదే కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీశారు. కానీ నవ్యాంధ్రప్రదేశ్లో సీనియారిటీకి ప్రాధాన్యమిస్తూ 2014లో చంద్రబాబుకు అధికారం ఇచ్చారు ఏపీ ప్రజలు. కానీ జగన్మోహన్ రెడ్డి వన్ చాన్స్ అంటూ ప్రజల మధ్యకు వెళ్లారు. పాదయాత్ర చేసి అధికారంలోకి రాగలిగారు.
* లోకేష్ కు ఇబ్బందులు..
రాజశేఖర్ రెడ్డి తరువాత చంద్రబాబు పాదయాత్ర చేశారు. వారిద్దరి తర్వాత షర్మిల కూడా పాదయాత్ర చేశారు. చివరిగా జగన్మోహన్ రెడ్డి కూడా చేశారు. అయితే ఇలా పాదయాత్రలు చేసే క్రమంలో అప్పటి ప్రభుత్వాలు ఎంతగానో సహకరించాయి. మిగతా రాజకీయ పార్టీల శ్రేణులు చూసేయే తప్ప పాదయాత్రలు చేసే వారికి అడ్డంకులు సృష్టించలేదు. ఇబ్బందులు పెట్ట దలుచుకోలేదు. కానీ లోకేష్ పాదయాత్ర చేసే సమయంలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైన్యం భగ్నం చేసేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎక్కడ లోకేష్ పొరపాటుగా మాట్లాడుతారా? ఆయనను పలుచన చేద్దామా అని చూసింది. ఈ క్రమంలో నిలదీతల పేరిట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఎగదోసింది. అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. వాటన్నింటినీ సంయమనంతో అధిగమించి పాదయాత్రను పూర్తి చేయగలిగారు లోకేష్.
* తప్పకుండా ప్రభావం
రాజకీయాల్లో ఒక పార్టీ కొన్ని రకాలు చేస్తుంది. దానిని చేయకుంటే అసమర్థత కింద లెక్క వేస్తారు. అందుకే ఇప్పుడు లోకేష్ కు ఎదురైన పరిణామాలు జగన్మోహన్ రెడ్డికి తప్పేలా లేవు. అలా అయితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సవ్యంగా సాగుతుందా? లేదా? అన్నది అనుమానమే. సుమారు 5000 కిలోమీటర్లు నడవాలి అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే దారి పొడవున లోకేష్ మాదిరిగా సోషల్ మీడియా సైన్యం, వారి ప్రోత్సాహంతో నిలదీతలు, ప్రశ్నలు ఉంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు చాలా కష్టం. అయితే ఎలాగైనా పాదయాత్ర చేస్తానని జగన్మోహన్ రెడ్డి గట్టిగా నిర్ణయించుకున్నారు. కానీ ఒక మనిషి ఒకసారి మాత్రమే చేస్తే బాగుంటుంది. రెండోసారి చేస్తే మాత్రం దాని ఫలితం ఎలా ఉంటుందో కూడా చెప్పలేం.