Homeఆంధ్రప్రదేశ్‌Vijayasai Reddy : విజయసాయిరెడ్డి తో బొత్సకు చెక్.. జగన్ ప్లాన్ మామూలుగా లేదుగా!*

Vijayasai Reddy : విజయసాయిరెడ్డి తో బొత్సకు చెక్.. జగన్ ప్లాన్ మామూలుగా లేదుగా!*

Vijayasai Reddy :  విజయసాయిరెడ్డి విశాఖలో అడుగుపెట్టారు. మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించారు. ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్తగా ఇటీవలే విజయసాయి నియమితులయ్యారు. దీంతో ఆయన చార్జ్ తీసుకున్నారు. నేరుగా రంగంలోకి దిగారు. అయితే ఆయనతో పార్టీ అభివృద్ధి కంటే.. వినాశనమే అధికమని వైసిపి శ్రేణులు భావిస్తున్నాయి. ఆయన రాకను వ్యతిరేకిస్తున్నాయి. కేవలం ఆయన విశాఖకు దోపిడి కోసమే వస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో.. విశాఖను పాలన రాజధానిగా ప్రకటించింది. అప్పుడే విశాఖ పై విజయసాయిరెడ్డి కన్ను పడింది. అధినేతకు రకరకాల లాబీయింగ్ చేసి విశాఖ వైపు వచ్చారు విజయసాయి. అయితే ఆయన విశాఖలో అడుగుపెట్టిన తరువాత ఉత్తరాంధ్ర వైసీపీ నేతల హవా కు చెక్ పడింది. ముఖ్యంగా విశాఖ జిల్లాలో మంత్రులు డమ్మీలు అయ్యారు. ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు సైతం చేతులు జోడించుకొని విజయసాయి వెంట ఉండాల్సి వచ్చింది. దాదాపు ప్రతి భూదందా వెనుక విజయసాయిరెడ్డి బినామీలు, కుటుంబ సభ్యులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటి మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ ఎంవీవి సత్యనారాయణ లాంటి వారు హై కమాండ్ కు నేరుగా ఫిర్యాదులు కూడా చేశారు. అయితే ఎన్నికలకు ముందు విజయసాయిరెడ్డిని ఆ పదవి నుంచి తొలగించారు జగన్. ఆ స్థానంలో తన బాబాయి వైవి సుబ్బారెడ్డిని కూర్చోబెట్టారు. అయితే ఇప్పుడు ఏం చేశారో తెలియదు కానీ.. తిరిగి విశాఖకు వచ్చారు విజయసాయి. ఉత్తరాంధ్ర సమన్వయ బాధ్యతలను సైతం తీసుకున్నారు.

* విశాఖపై బొత్స ఆశ
అయితే విశాఖపై చాలా ఆశలు పెట్టుకున్నారు బొత్స. ఈ ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేశారు బొత్స భార్య ఝాన్సీ లక్ష్మి. విజయనగరం తో పాటు విశాఖ బాధ్యతలు తనకు విడిచి పెడితేనే అని అప్పట్లో బొత్స షరతు పెట్టినట్లు తెలుస్తోంది. అప్పుడే తన భార్యను విశాఖ ఎంపీగా పోటీ చేయిస్తానని జగన్ వద్ద హామీ తీసుకున్నట్లు సమాచారం. అయితే కూటమి ప్రభంజనంలో బొత్స ఝాన్సీ లక్ష్మి సైతం ఓడిపోయారు. కానీ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రూపంలో బొత్స సత్యనారాయణ కు మరో అవకాశం దక్కింది. అయితే బొత్స కావడంతో.. వేరువేరు సమీకరణలను దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ స్థానాన్ని ఏకగ్రీవంగా బొత్సకు విడిచిపెట్టింది. అప్పటినుంచి బొత్స హవా విశాఖ జిల్లాలో పెరిగింది. బొత్స ఇదే మాదిరిగా వ్యవహరిస్తే వైసిపి కానీ, జగన్ కానీ విశాఖలో తమదైన ముద్ర చూపే అవకాశం లేదు. అందుకే బొత్స హవాను చెక్ చెప్పేందుకు విజయసాయిరెడ్డిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

* అప్పట్లో చాలా ఆరోపణలు
విజయసాయి రెడ్డి పై చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. దస్ పల్ల, హయగ్రీవ భూముల విషయంలో దందాకు తెర లేపారని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. కుటుంబ సభ్యులు సైతం భారీగా భూములు కొల్లగొట్టారు అన్న విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ పార్టీకి మైనస్ గా మారాయి. మళ్లీ ఇప్పుడు అదే విజయసాయిరెడ్డిని విశాఖ తెరపైకి తేవడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న వినిపిస్తోంది. పార్టీ శ్రేణులు అభ్యంతరం చెబుతున్నాయి. ప్రజలు సైతం విజయసాయిరెడ్డి విషయంలో ఆహ్వానించే పరిస్థితి లేదు. కానీ జగన్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా.. విజయసాయిరెడ్డిని విశాఖకు తీసుకురావడం గమనార్హం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular