Jagan And Sharmila: ఏపీ రాజకీయాలు హిట్ ఎక్కుతున్నాయి. ప్రధానంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో నెలకొన్న ఆస్తి వివాదం దుమారానికి దారితీస్తోంది. అయితే ఈ విషయంలో తప్పెవరిది? అనే దానిపై బలమైన చర్చ నడుస్తోంది.షర్మిల తనకు క్షోభకు గురి చేస్తున్నారని జగన్ ఆరోపిస్తుండగా.. తండ్రి అకాల మరణంతో జగన్ మాట మార్చారని ఆరోపిస్తున్నారు షర్మిల. పరస్పర లేఖాస్త్రాలు, ఆరోపణలు, ప్రత్యరోపణలతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతోంది. గత పది రోజులుగా మీడియాలో ఇదే హైలెట్ అవుతోంది. ఇతర అంశాలు పక్కకు వెళ్లిపోయాయి. అయితే కూటమి పార్టీలు నిశితంగా ఈ పరిణామాలను గమనిస్తున్నాయి. అయితే షర్మిల వెనుక చంద్రబాబు ఉన్నారని వైసీపీ అనుమానిస్తోంది. చంద్రబాబు ప్రోత్సాహంతోనే షర్మిల జగన్ పై విరుచుకుపడుతున్నారని వైసీపీ నేతలు భావిస్తున్నారు.ఇదే విషయాన్ని బయటపెట్టారు కూడా.అయితే మీ కుటుంబ వివాదంలో మమ్మల్ని లాగొద్దంటూ చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు.గతంలో కూడా వివేకానంద రెడ్డిని తామే హత్య చేశామని చెప్పారని.. లేనిపోని నిందలు వేశారని చంద్రబాబు గుర్తు చేశారు. అయితే తల్లిని, చెల్లెలిని న్యాయం చేయలేని నాయకుడు రాష్ట్రానికి ఏం చేస్తాడు అంటూ మంత్రులుసెటైర్లు వేయడం ప్రారంభించారు.తద్వారా ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావించారు.అయితే వైయస్సార్ కుటుంబ ఆస్తి వివాదం నేపథ్యంలో జరిగిన పరిణామాలతో.. కూటమి ప్రభుత్వానికి సంబంధించి సమస్యలు బయటకు రాలేదు.ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడతామని చెప్పిన వైసీపీ ప్రయత్నాలు ఈ వివాదంతో ఆగిపోయాయి.
* ఇసుక పాలసీపై విమర్శలు
కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఇసుక విధానంపై అనేక రకాల విమర్శలు వచ్చాయి.దీనిపై గట్టిగా పోరాటం చేయాలని వైసిపి భావించింది.వైసిపి హయాంలో కంటే ఇసుక ఖరీదైన వస్తువుగా మారిపోయిందని ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేశారు. ఈ వైఫల్యం పై పోరాడాలని నిర్ణయించారు. దీనికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. కానీ ఇంతలో కుటుంబ ఆస్తి వివాదం తెరపైకి రావడంతో వైసిపి డిఫెన్స్ లో పడిపోయింది. షర్మిల నుంచి వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నంలో నేతలు ఉండిపోయారు. దీంతో ఇసుక విధానం పై పోరాటం తాత్కాలికంగా నిలిచిపోయింది.
* మద్యం విధానంలో వైఫల్యాలు
మరోవైపు ఏపీలో ప్రైవేటు మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి.అయితే పారదర్శకంగా ప్రైవేటు షాపులు ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెబుతోంది.కానీ అధికార పార్టీ కను సన్నల్లోనే తతంగం అంతా జరిగిందని వైసీపీ చెప్తోంది.అసలు మద్యం ధరలు తగ్గలేదని.. పాత ధరలతోనే విక్రయిస్తున్నారని ఆరోపిస్తోంది. దానిపైనే పోరాడేందుకు సిద్ధపడింది. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు నిర్ణయించింది. తమ మద్యం పాలసీపై అప్పట్లో ఆరోపణలు చేశారని.. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ చేస్తున్నది ఏమిటని నిలదీసేందుకు సిద్ధమయింది. అయితే ఇంతలో ఆస్తివివాదం తెరపైకి వచ్చింది.షర్మిల వెర్సెస్ వైసీపీ నేతలు అన్నట్టు పరిస్థితి మారింది. మరోవైపు సరస్వతి పవర్ కంపెనీ అనేది ఏర్పాటు చేయకుండానే.. భూములు కొల్లగొట్టారని ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. తద్వారా జగన్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. మొత్తానికైతే గత పది రోజులుగా జరుగుతున్న పరిణామాలు కూటమి పార్టీలకు కలిసి వచ్చేలా ఉన్నాయి. వైసీపీకి మాత్రం భారీ డ్యామేజ్ చేశాయి.