Ram Gopal Varma : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( director Ram Gopal Varma) గురించి ఆరా తీసేవారు ఎక్కువయ్యారు. పోసాని కృష్ణమురళి అరెస్ట్ నేపథ్యంలో.. రాంగోపాల్ వర్మ అరెస్టు సైతం ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే పోసాని విషయంలో అస్సలు గ్యాప్ ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారు ఏపీ పోలీసులు. నిన్నటికి నిన్న ఆయన అన్ని కేసుల్లో బెయిల్ పొందారు. కానీ చివరి నిమిషంలో పీటీ వారెంట్ ఇచ్చి.. సిఐడి తన కస్టడీలోకి తీసుకుంది. గుంటూరు కోర్టులో హాజరు పరిచింది. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో పోసాని కృష్ణ మురళి ఇప్పట్లో బయటపడే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే పోసానితో పోల్చుకుంటే.. రాంగోపాల్ వర్మ మాత్రం ఇట్టే కొంత ఉపశమనం పొందారు. అరెస్టు నుంచి తప్పించుకున్నారు.
* వివాదాస్పద పోస్టులతో..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో ఓ రేంజ్ లో విరుచుకుపడేవారు రామ్ గోపాల్ వర్మ. గతంలో తన సినిమాల ద్వారా ప్రభావితం చేసేవారు. సూపర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ ఎందుకు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వివాదాస్పద పోస్టులు పెట్టేవారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సినిమాలు తీసేవారు. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థులను విభిన్న పాత్రల ద్వారా చూపిస్తూ తక్కువ చేసే ప్రయత్నం చేశారు. మధ్య మధ్యలో కాంట్రవర్సీ సోషల్ మీడియా పోస్టులు పెడుతూ తనకున్న మంచి పేరును పోగొట్టుకున్నారు.
* సినిమా ప్రమోషన్ లో
వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy)రాజకీయ జీవితాన్ని ఇతివృత్తంగా చేసుకొని వ్యూహం సినిమాను రూపొందించారు. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి పోస్టులు పెట్టారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. కానీ కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అటు తర్వాత వచ్చి న్యాయపోరాటం చేయడం ప్రారంభించారు. దీంతో అరెస్టు కాకుండా కొంతవరకు నిలబడగలిగారు. కానీ పోసాని కృష్ణ మురళి ఎపిసోడ్ చూశాక.. రామ్ గోపాల్ వర్మ లో ఒక రకమైన భయం ప్రారంభం అయినట్టు కనిపిస్తోంది.
* గతానికి భిన్నంగా..
ప్రస్తుతం తాను రూపొందించిన శారీ మూవీ ప్రమోషన్ లో ఉన్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ తరుణంలో పలు సోషల్ మీడియా విభాగాలకు, యూట్యూబ్ ఛానల్ లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కనీసం రాజకీయాల గురించి మాట్లాడడం లేదు. తనపై నమోదవుతున్న కేసుల ప్రస్తావన లేదు. తనకు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పుకొస్తున్నారు. ఇంటర్వ్యూలు చేసిన వారు విభిన్నంగా ప్రశ్నిస్తున్న.. స్పందించడం లేదు రామ్ గోపాల్ వర్మ. దీంతో ఆయనలో భయం ప్రారంభం అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.