Hyper aadhi  : వైసీపీని వెంటాడి వేటాడుతున్న బుల్లితెర కమెడియన్.. వేదిక ఏదైనా హాట్ కామెంట్స్!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటుతోంది. వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి ఆ పార్టీ కోలుకుంటోంది. కానీ ఇప్పటికీ అవమానాలు, విమర్శలు తప్పడం లేదు.

Written By: Dharma, Updated On : August 6, 2024 12:23 pm
Follow us on

Hyper aadhi : ఎన్నికల్లో వైసీపీ ఓటమి..కూటమి గెలుపును ఆస్వాదిస్తోంది తెలుగు సినీ పరిశ్రమ. గత ఐదు సంవత్సరాలుగా ఆ పరిశ్రమ విషయంలో వైసీపీ సర్కార్ చాలా దూకుడుగా వ్యవహరించింది. సినిమా టికెట్ల విషయంలో చర్చించేందుకు వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి బృందాన్ని అవమానించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అందుకే ఈసారి సినీ పరిశ్రమ నుంచి వైసీపీకి మద్దతు లభించలేదు.2019 ఎన్నికల్లో మద్దతు తెలిపిన పరిశ్రమ వ్యక్తులు సైతం ఈసారి అటువైపుగా చూడడం మానేశారు. పోసాని కృష్ణ మురళి, అలీ వంటి వారు మాత్రమే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల తరువాత అలీ వైసీపీకి రాజీనామా చేశారు. పోసాని కృష్ణమురళి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అటు మాజీ మంత్రి ఆర్కే రోజా సైతం చెన్నై బాట పట్టినట్లు వార్తలు వస్తున్నాయి.అనవసరంగా సినీ పరిశ్రమతో పెట్టుకునే ఇంతటి పరిస్థితి తెచ్చుకున్నామని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లాంటివారు బహిరంగంగానే వ్యాఖ్యానించారు.వైసిపి ఓడిపోవడం,పవన్ నేతృత్వంలోని జనసేన సంపూర్ణ విజయం సాధించడం కూడా సినీ పరిశ్రమను ఆనందంలో ముంచేత్తుతోంది. అయితే జగన్ ఓడిపోయిన తరువాత సినీ పరిశ్రమ నుంచి వస్తున్న కామెంట్స్ తగ్గడం లేదు. ముఖ్యంగా సినీ ఈవెంట్స్ లో సైతం వైసీపీ ఓటమిని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటున్నారు. డైలాగులతో గుర్తు చేసి మరి వైసిపి పై విమర్శలు చేస్తున్నారు. తాజాగా బుల్లితెర కమెడియన్ హైపర్ ఆది సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. జగన్ తో పాటు మాజీమంత్రి రోజాను టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని.. అందరం కలిసి పోదాం అంటూ ఆ మధ్యన ప్రత్యేక వీడియో విడుదల చేసిన ఆది తాను మాత్రం వైసిపి పై విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు.

* విమర్శలతో విరుచుకుపడిన ఆర్పి
జబర్దస్త్ మాజీ ఫేమ్ ఆర్ పి ఎన్నికలకు ముందు నుంచే టిడిపికి మద్దతుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులపై విరుచుకుపడేవారు. బాహటంగానే విమర్శలు చేసేవారు. అంతకుముందు జబర్దస్త్ నటులు జనసేనకు మద్దతుగా ప్రచారం చేయడాన్ని రోజా ఎద్దేవా చేశారు. సినీ అవకాశాల కోసమే వారు అలా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. వారంతా చిన్న నటులుగా అభివర్ణించారు. ఈ క్రమంలో ఆర్పి ఘాటుగా స్పందించారు. శాసనసభలో రోజా వ్యవహరించిన తీరును తప్పుపడుతూ.. ఆర్పి చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ గా మారాయి.’ జగనన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారు అన్న’ అంటూ రోజా చేసిన వ్యాఖ్యలను.. ఎద్దేవా చేస్తూ ఆర్పి కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి.

* అవే విమర్శలతో స్కిట్
అయితే ఆర్పి కామెంట్స్ ను గుర్తుచేస్తూ హైపర్ ఆది ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రత్యేక స్కిట్ చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎన్ని ఎపిసోడ్ చేశావంటూ పొట్టి నరేష్ ని అడుగుతాడు ఆది. 174 చేశానని నరేష్ చెబితే.. వై నాట్ అంటూ ఆది బదులిస్తాడు. జగన్ వై నాట్ 175 నినాదాన్ని గుర్తు చేస్తాడు. శ్రీదేవి డ్రామా కంపెనీలో నా గురించి ఏమనుకుంటున్నారని ఆది అడిగితే..’ ఆది అన్న.. నువ్వు సూపర్ అన్న.. అందరూ మెచ్చుకుంటున్నారు అన్న’ అంటూ నరేష్ నాడు శాసనసభలో రోజా సీఎం జగన్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ను గుర్తు చేశారు.

* తాజాగా ఓ సినీ ఈవెంట్లో
తాజాగా ఓ సినీ ఈవెంట్లో సైతం ఆది వైసీపీ పై పరోక్ష విమర్శలు చేశారు. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె కొణిదల నిహారిక ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 11 మంది కొత్త నటులతో కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఆ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం సందడిగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హైపర్ ఆది మాట్లాడుతూ.. 11 అంటే మనకు చాలా గుర్తొస్తాయి అంటూ నవ్వులు పూయించారు. వైసిపి బలం 11 మందికే పరిమితం అయిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆది ఈ కామెంట్స్ చేశారు. మొత్తానికైతే హైపర్ ఆది వైసిపి శ్రేణులను వెంటాడుతూనే ఉన్నారు. చురకత్తు లాంటి మాటలతో ఓ రేంజ్ లో వేసుకుంటున్నారు.