CM Jagan
CM Jagan: ఏపీ సీఎం జగన్ మొండిఘటమే. ఇది చాలా సందర్భాల్లో వెల్లడైంది. తండ్రి రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో కాంగ్రెస్ హై కమాండ్ పై తిరగబడ్డారు. మొండిగా వ్యతిరేకించారు. జైలు పాలయ్యారు. 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. సొంత పార్టీ పెట్టుకుని అధికారంలోకి రాగలిగారు. ఈ పరిణామ క్రమంలో ఆయన మొండితనం అడుగడుగునా బయటపడింది. అదే మొండితనం విజయ తీరాల వైపు చేర్చింది. ఇప్పుడు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను మార్చి ఎన్నికలకు వెళ్లాలనుకోవడం సాహసం. అంతకంటే మొండితనంగా కనిపిస్తోంది.
దివంగత నేత ఎన్టీఆర్ సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం.. మొండితనం చూపడం వంటివి చేసేవారు. పదవులకు రాజీనామా చేయడం, చేయించడం విషయంలో సంచల నిర్ణయాలు తీసుకునేవారు. ఒకసారి ప్రభుత్వాన్నే రద్దుచేసి ఎన్నికలకు వెళ్లిన సాహసి ఎన్టీఆర్. అయితే అటు తరువాత అంతటి సంచలన నిర్ణయాలు తీసుకునేది ఇప్పుడు జగన్ గా తెలుస్తోంది.జగన్ చెప్తారంటే చేస్తారు. అంతకుమించి తాను అనుకున్నది సాధిస్తారు. ఆయన విషయంలో అభిమానులు చెప్పుకొచ్చేది ఇదే. ఇప్పుడు ఒకే రోజు 11 మంది అభ్యర్థులను మార్చడం ద్వారా తాను మొండి వాడినన్న సంకేతాలు పంపారు. మరో 70 సీట్లను మార్చుతామని చెప్పి సాహస నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడ బోనని తేల్చి చెబుతున్నారు.
మొండితనంగా, సాహస నిర్ణయాలు తీసుకునేటప్పుడు.. వాటి పర్యవసానాలను సైతం అనుభవించాల్సి ఉంటుంది. అనుకూలంగా ఫలితాలు వస్తే పేరు మార్మోగిపోతుంది. ప్రతికూల ఫలితాలు వస్తే మాత్రం వైఫల్యం ముద్ర వేస్తారు. అయితే రాజకీయాలు అన్నాక గెలుపోటములు సహజం.అయితే అందుకు జగన్ సిద్ధంగా ఉండాలి. తెగువను ప్రదర్శించే ముందు దుష్పరిణామాలు కూడా చవిచూడాల్సి ఉంటుంది. వాటిని అధిగమించి ముందుకెళ్లాల్సి ఉంటుంది. బీసీల కోసం తన సామాజిక వర్గాన్ని పణంగా పెట్టడం సాహసమే. అదే సమయంలో బీసీల అభిమానాన్ని చురగొనడం కూడా ముఖ్యమే. అయితే బీసీ అంటే ఒక సామాజిక వర్గం కాదు.. అది బహుళ జనుల సమూహం. అక్కడ కూడా సామాజిక వివక్ష ఉంది. వీటన్నింటినీ తట్టుకొని ముందుకు వెళ్లగలిగితే మాత్రం జగన్ సక్సెస్ అయినట్టే. లేకుంటే లేని ఇబ్బందులను కొని తెచ్చుకున్నట్టే.