Viveka Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఐదున్నర సంవత్సరాలు అవుతోంది. కానీ ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు. వివేకానంద రెడ్డి మాజీ ముఖ్యమంత్రి సోదరుడు,మరో మాజీ సీఎం బాబాయ్, ఆయన స్వతహాగా మాజీ మంత్రి,మాజీ ఎంపీ కూడా. అటువంటి వ్యక్తి చనిపోయి ఐదున్నర సంవత్సరాలు దాటుతుంటే.. ఇంతవరకు కేసు కొలిక్కి రాకపోవడం వ్యవస్థల వైఫల్యం. నిందితులను పట్టుకోలేకపోవడం రక్షణ అధికారుల నిర్లక్ష్యం, నిర్లిప్తత కూడా. దేశంలో వ్యవస్థల పనితీరు, ఉదాసీనతకు ఈ కేసు ఒక మచ్చుతునక. సాధారణంగా ఒక హత్య జరిగితే గంటల వ్యవధిలో,రోజుల వ్యవధిలో, నెలల వ్యవధిలో ఛేదించడం చూస్తుంటాం. కానీ ఈ కేసు విషయంలో మాత్రం జరిగిన జాప్యం చూస్తుంటే వ్యవస్థలపై అపహాస్యం వేస్తోంది. రాజకీయ వ్యవస్థకు.. ఇతర వ్యవస్థలు దాసోహం కావడం దురదృష్టకరం.
* సరిగ్గా ఎన్నికలకు ముందు
2019 ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. మార్చి 15న ఇంట్లోనే రక్తపు మడుగులో ఉన్నారు. అయితే గుండెపోటు అని.. కాదు కాదు చంపేశారని మరోసారి ఆరోపణలు చేశారు అప్పటి విపక్ష నేతలు. అంతటితో ఆగకుండా సిబిఐ దర్యాప్తు కావాల్సిందేనని పట్టుపట్టారు. రాజకీయ ప్రత్యర్థులే చంపేసారని ఆరోపణలు చేశారు. అవే ఆరోపణలను ఎన్నికల్లో వాడుకున్నారు. విపరీతమైన సింపతీని పొందారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. కానీ అధికారంలోకి వచ్చిన జగన్ మాట మార్చారు. సిబిఐ విచారణ అవసరం లేదని చెప్పుకొచ్చారు. కానీ వివేకానంద రెడ్డి కుమార్తె న్యాయపోరాటం చేయడంతో అదే సిబిఐ విచారణ కొనసాగుతూ వస్తోంది. కానీ ఆ విచారణకు కూడా అడ్డు తగులుతూ వ్యవస్థలతో ఆడుకుంటున్నారు కొందరు.
* దాదాపు అందరికీ బెయిల్
దాదాపు ఈ హత్య కేసులో అందరికీ బెయిల్ వచ్చేసింది. చివరిగా జైల్లో ఉన్న ఉమా శంకర్ రెడ్డి కి కూడా బెయిల్ వచ్చింది. మెయిన్ సూత్రధారిగా సిబిఐ ఆరోపిస్తున్న అవినాష్ రెడ్డి అయితే.. ఎప్పుడు అరెస్ట్ అయ్యారో.. ఎప్పుడు బెయిల్ పై బయటకు వచ్చేసారో తెలియని విచిత్ర పరిస్థితిలో ఈ కేసు ఉందంటే.. ఏ స్థాయిలో మేనేజ్ జరుగుతుందో అర్థమవుతుంది. నిందితులుగా ఉన్న శివశంకర్ రెడ్డి సహా అందరూ బయటకు వచ్చేశారు. కేసు మాత్రం కొలిక్కి రాలేదు. తన తండ్రి మరణం పై కేసు విచారణ వేగవంతం చేయాలని కుమార్తె సునీత సీఎం చంద్రబాబును కలిశారు, హోం మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. అయినా సరే నిందితులకు బెయిల్ లభిస్తుండడం, సిబిఐ విచారణ ముందుకు సాగకపోవడంతో సామాన్యుల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. వ్యవస్థలు ఇంత దారుణంగా తయారయ్యాయా? అన్న బాధ వ్యక్తం అవుతోంది.