AP: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదల ఇళ్లల్లో వెలుగులు పంచేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. 1.50 లక్షల ఇళ్లకు విద్యుత్ ఉపకరణాలను అందించేందుకు నిర్ణయం తీసుకుంది.కేంద్ర ప్రభుత్వం, విద్యుత్ శాఖ జాయింట్ వెంచర్ అయిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ తో..ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నాయి.సీఎం చంద్రబాబు సమక్షంలో అగ్రిమెంట్ సైతం కుదిరింది. దీని ప్రకారం ఏపీలోని 1,50,000 ఇళ్లకు ఎల్ఈడి బల్బులు, ట్యూబ్ లైట్ లు, బి ఎల్ డి సి ఫ్యాన్లు అందించనున్నారు. విద్యుత్ను ఆదా చేసే క్రమంలోనే ఈ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అల్పాదాయ వర్గాల వారికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1.50 లక్షల ఇళ్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇళ్ల నిర్మాణదారులకు ఇప్పుడు కొత్త విద్యుత్ ఉపకరణాలను అందిస్తారు. ప్రతి ఇంటికి నాలుగు ఎల్ఈడి బల్బులు, రెండు బాటిన్ ట్యూబ్ లైట్లు , రెండు ఫైవ్ స్టార్ బిఎల్డిసి ఫ్యాన్లు అందజేయనున్నారు. వీటి వినియోగం ద్వారా లబ్ధిదారుల ఇళ్లల్లో విద్యుత్ ఆదా చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.ఈ పరికరాల సేకరణ, పంపిణీ ఈఈఎస్ఎల్ అధికారుల పర్యవేక్షణలో జరగనుంది. దేశవ్యాప్తంగా ఇంధన ఆదా కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఏపీతో కేంద్ర ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుంది.
* ఆ ఫ్యాన్లు కూల్
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏపీలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి. కార్తీక మాసం సమీపిస్తున్నా ఎండలు మండిపోతున్నాయి. అదే వేడి కొనసాగుతోంది. అందుకే ప్రతి ఒక్కరూ బిఎల్డిసి ఫ్యాన్లు అమర్చుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇవి విద్యుత్ సైతం ఆదాచాయని తెలుస్తోంది. మరోవైపు ఎల్ఈడి బల్బులతో పాటు బ్యాటన్ ట్యూబ్ లైట్లు ఎక్కువగా లైటింగ్ ఇస్తాయి. ఎక్కువ కాలం మన్నిక కూడా ఇచ్చే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
* అప్పటి మాదిరిగానే
2014లో టిడిపి ప్రభుత్వం వచ్చింది. అప్పట్లో కూడా చంద్రబాబు ఎల్ఈడి బల్బులను తెరపైకి తెచ్చారు. అంతవరకు వీధిలైట్లను సైతం ట్యూబ్లైట్లను వాడేవారు. కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం ఎల్ఈడి లైట్లు అందుబాటులోకి తెచ్చింది. వాటితో విద్యుత్ వినియోగం కూడా తగ్గింది. స్థానిక సంస్థలపై ఆర్థిక భారం కూడా తగ్గుముఖం పట్టింది. అందుకే ఇప్పుడు తాజాగా పేదల ఇళ్లకు సంబంధించిన విద్యుత్ వినియోగాన్ని తగ్గించే పనిలో పడింది సర్కార్. తద్వారా రాయితీ విద్యుత్ వినియోగం తగ్గుముఖం పట్టనుంది. పేదలపై విద్యుత్ భారం కూడా తగ్గనుంది. మొత్తానికైతే కూటమి సర్కార్ వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తుండడం విశేషం.