AP Elections 2024: సాధారణంగా పోస్టల్ బ్యాలెట్ లో ఉద్యోగులు ఓటు వేయడం అంతంత మాత్రమే. ప్రత్యేక పరిస్థితుల్లో కానీ వారు వినియోగించారన్న అపవాదు ఉంది. కానీ ఈసారి ఉద్యోగులు పట్టు పట్టి మరి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల దరఖాస్తులను పొందడం ఆసక్తిగా మారింది. ప్రతి ఎన్నికల్లోనూ లక్షన్నర పోస్టల్ బ్యాలెట్ల దరఖాస్తులు వచ్చేవి. కానీ ఈసారి మాత్రం ఐదు లక్షల వరకు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సహజంగానే ఇది వైసీపీకి కలవరపాటుకు గురి చేసే అంశమే.ఎన్నికల విధులు,ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ ను వినియోగించుకోవచ్చు. ఇదో పెద్ద ప్రక్రియ కావడంతో ఉద్యోగులు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. అటువంటిది ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్స్ దరఖాస్తులు రావడం సంచలనమే.
2019 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్స్ కు సంబంధించి లక్షన్నర దరఖాస్తులు వచ్చాయి.అప్పట్లో జగన్ విపక్ష నేతగా ఉండగా.. సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆ పార్టీ వైపు టర్న్ అయ్యారు. పోస్టల్ బ్యాలెట్స్ లో సైతం వైసీపీకి స్పష్టమైన మెజారిటీ దక్కింది. ఉద్యోగుల్లో 80 శాతానికి పైగా వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేశారు. అయితే పాజిటివ్ ఉన్నప్పుడే లక్షన్నర దరఖాస్తులు రాగా.. ఇప్పుడు ఈ ఏకంగా ఐదు లక్షల దరఖాస్తులు రావడం మాత్రం ఆశ్చర్యం వేస్తోంది. ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో కసి కనిపిస్తోంది.
గత ఐదు సంవత్సరాలుగా ఉద్యోగ, ఉపాధ్యాయులు వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకం అయ్యారు.అప్పటివరకు వస్తున్న రాయితీలను జగన్ సర్కార్ రద్దు చేసింది.జీతాలు కూడా సక్రమంగా అందించిన దాఖలాలు లేవు.ఉద్యోగుల రాయితీలు లేవు.వారికి అందాల్సిన బెనిఫిట్ లు అందలేదు.పైగా ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలిపిన వారిపై సైతం ఉక్కు పాదం మోపారు.ఇవన్నీ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లోఆగ్రహానికి కారణమయ్యాయి. వాస్తవానికి జగన్ సర్కారుపై ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని ఆ పార్టీ నేతలకు సైతం తెలుసు. వైసీపీ శ్రేణులు బాహటంగానే ఈ విషయాన్ని చెప్తున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులు తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారన్న నిర్ణయానికి కూడా వచ్చారు. అయితే ఇప్పుడు ఏకంగా ఐదు లక్షల పోస్టల్ బ్యాలెట్స్ ఓట్లకు సంబంధించి దరఖాస్తులు రావడం వైసీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉద్యోగ ఉపాధ్యాయులే కాదు వారి కుటుంబ సభ్యులు, సమీప బంధువులుసైతం ఇదే నిర్ణయానికి వస్తే ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గత ఎన్నికలకు ముందు సిపిఎస్ రద్దు అనే ఒకే ఒక అంశాన్ని పట్టుకొని వైసీపీకి అనుకూలంగా పని చేశాయి ఆ రెండు వర్గాలు. కానీ ఇప్పుడు వ్యతిరేకంగా అంతకుమించి పని చేస్తున్నాయి. జూన్ 4నముందుగా లెక్కించేది పోస్టల్ బ్యాలెట్స్ ఓట్లే. అది ఊహించుకునే వైసిపి నేతలు ఎక్కువగా భయపడుతున్నారు.