AP Congress: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బాగా బలహీనపడింది. తెలంగాణలో కాస్త మెరుగ్గా ఉన్నా.. ఏపీలో మాత్రం ఘోర పరిస్థితి నెలకొంది. దీంతో ఆ పార్టీ నాయకులు ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. కొందరు టీడీపీలో చేరగా, మరికొందరు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ ప్రభావంతో 2014, 2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఈ క్రమంలో ఏపీలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దృష్టిపెట్టింది. గతేడాది జరిగిన కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీలోనూ పార్టీని బలోపేతం చేసేదిశగా ఏఐసీసీ అడుగులు వేస్తోంది.
4న కాంగ్రెస్‌లో చేరిన షర్మిల..
తెలంగాణలో రాజకీయాలు చేయడానికి ౖదివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి తనయ, ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్.జగన్ సోదరి షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. పార్టీని ప్రజల్లో తీసుకెళ్లేందుకు పాదయాత్ర చేశారు. కానీ, ఆశించిన స్పందన రాలేదు. దీంతో గతేడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో షర్మిల కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం జరిగింది. అయితే ఎన్నికల్లో షర్మిల తెలంగాణలోనే పనిచేస్తానని చెప్పడంతో చేరిక వాయిదా పడింది. టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి కూడా షర్మిల తెలంగాణలో రాజకీయాలు చేయడాన్ని వ్యతిరేకించారు. ఈ క్రమంలో షర్మిల కాంగ్రెలో చేరికపై మళ్లీ సందిగ్ధం నెలకొంది. కానీ అంతా అనుకున్నట్లుగానే జనవరి 4న షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతోపాటు వైఎస్సార్ టీపీ కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆరోజు షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తానని తెలిపారు. అండమాన్‌లో అయినా, ఆంధ్రప్రదేశ్‌లో అయినా పని చేయడానికి సిద్ధమని ప్రకటించారు.
చివరకు వైఎస్సార్ ఫ్యామిలీనే దిక్కు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండు పర్యాయాలు పీసీసీ చీఫ్‌గా, ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్.రాజశేఖరరెడ్డి నాడు చతికిలబడిన కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చారు. టీడీపీ పదేళ్ల పాలనతో కాంగ్రెస్ నాడు పూర్తిగా బలహీనపడింది. అప్పుడు పీసీసీ చీఫ్‌గా పగ్గాలు చేపట్టిన వైఎస్సార్.. ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేశారు. ఎండ, వాన, చలి అని లేకుండా ఉమ్మడి ఏపీలో పాదయాత్ర చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. దీంతో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యారు. 2009 ఎన్నికల్లోనే సంక్షేమ పథకాలతో కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తెచ్చారు. కానీ అదే ఏడాది హెలిక్యాప్టర్ ప్రమాదంలో మృతిచెందాడు. తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం, 2014లో తెలంగాణ ఏర్పడడం జరిగింది. రాష్ట్రాన్ని విభజించిందన్న కోపంతో ఏపీలో అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ప్రజలు కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించారు. ఆ ఎన్నికల్లో ఒక్కస్థానం కూడా గెలవలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చింది. వైఎస్సార్ సీపీ 60 స్థానాలతో ప్రతిపక్షానికి పరిమితమైంది. తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ను ఏపీ ప్రజలు ఆదరించలేదు. ఈసారి వైఎస్సార్‌సీపీని 150 సీట్లతో గెలిపించారు. టీడీపీని 23 సీట్లకు పరిమితం చేశారు. 2023లో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం మళ్లీ వైఎస్ ఫ్యామిలీనే నమ్ముకుంది. ఆయన కూతురును పార్టీలో చేర్చుకుని పీసీసీ పగ్గాలు అప్పగించింది. ఈమేరకు జనవరి 16న ఉత్తర్వులు జారీ చేసింది.
ఏఐసీసీ ఆహ్వానితుడిగా గిడుగు..
మరోవైపు నిన్న రాజీనామా చేసిన ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజును ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈమేరకు కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ రెండు నియామకాలు తక్షనమే అమలులోకి వస్తాయని ప్రకటించింది. రుద్రరాజు రాజీనామా చేసిన 24 గంటల్లోనే షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించడం విశేషం. ఇక కాంగ్రెస్‌లో చేరిన పక్షం రోజుల్లోనే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు దక్కించుకున్నారు షర్మిల.
షర్మిల సారథ్యంలో ఎన్నికలకు..
మరో రెండు నెలల్లో ఏపీ అసెంబ్లీతోపాటు లోక్‌సభకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలను ఏపీ కాంగ్రెస్ షర్మిల సారథ్యంలోనే ఎదుర్కొననుంది. వైఎస్సార్ కుటుంబం నుంచి వచ్చిన షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించిన నేపథ్యంలో గతంలో పార్టీ వీడిన నేతలు, ఇతర పార్టీల్లో టికెట్లు రానివారు కాంగ్రెస్‌లో చేరుతారని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. మరి షర్మిల ప్రభావం కాంగ్రెస్‌ను ఏమేరకు బలోపేతం చేస్తుందో చూడాలి.