Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: ఇంతకీ పవన్ కళ్యాణ్ కైనా టికెట్ కన్ఫమేనా?

Pawan Kalyan: ఇంతకీ పవన్ కళ్యాణ్ కైనా టికెట్ కన్ఫమేనా?

Pawan Kalyan: ఏపీలో పొత్తుల లెక్కలు మారుతున్నాయి. గతంలో చేసిన కేటాయింపుల్లో సైతం కోతపడుతోంది. ముఖ్యంగా జనసేన మూడు అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానాన్ని త్యాగం చేసింది. పొత్తులో వచ్చినవే తక్కువ సీట్లు అయితే… ఇలా త్యాగాలు చేయాల్సి రావడంపై జనసేన శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పొత్తు టిడిపికి అత్యంత అవసరం కాగా.. వారు త్యాగాలు చేయాల్సి ఉండగా.. పవన్ తో త్యాగం చేయించడం ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ విషయంలో జనసైనికులు బాధతో ఉండగా ప్రత్యర్ధులు ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. దీంతో అటు పొత్తుల్లో సీట్లు కోల్పోతుండడం.. ఇటు సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుండడంతో జనసైనికులు పడుతున్న బాధ వర్ణనాతీతం. చివరికి పవన్ కైనా టికెట్ ఇస్తారా? ఇవ్వరా? అని ప్రశ్నించే రేంజ్ కు పరిస్థితి రావడం విశేషం.

సందట్లో సడేమియా అన్నట్టు వైసిపి సోషల్ మీడియా తెగ రెచ్చిపోతోంది. చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీ రాజకీయ వాతావరణ హెచ్చరిక అంటూ సాగుతున్న ఈ కామెంట్స్ హీట్ పుట్టిస్తున్నాయి. జనసేనకు ఇప్పుడు ప్రకటించిన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు ఖాయమైనట్టు కాదట. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా నామినేషన్ల చివరి రోజు వరకు మార్పులు చేర్పులు చేయొచ్చట. అవసరమైతే పవన్ తన సీట్లలో కోత విధించుకోవడానికి సిద్ధంగా ఉన్నారట. అసలు పార్లమెంట్ సీట్లు లేకుండానే 10 అసెంబ్లీ సీట్లు కైనా ఆయన అంగీకరిస్తారట. జనసేన సీన్ల రిమోట్ చంద్రబాబు చేతిలో ఉందట. చంద్రబాబు మనసులో కలిగే ఆలోచన బట్టి జనసేన భవిష్యత్తు ఆధారపడి ఉందట. అందుకే జనసేనకు 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ సీట్లు ఫైనల్ అని ఆ పార్టీ కార్యకర్తలు అనుకోకూడదు అట. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునే గుండె నిబ్బరం వారికి అవసరమట. ఇలా వైసీపీ సోషల్ మీడియా పోస్టులతో రెచ్చిపోతోంది.

పవన్ ఎందుకో భయపడుతున్నారు అన్న కామెంట్ బలంగా వినిపిస్తోంది. లేకుంటే ఇప్పుడు పొత్తు అనేది టిడిపికి కీలకం. ఆ పార్టీ త్యాగం చేయాల్సి ఉంది. చేతిలో 140 కి పైగా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా ఐదు ఆరు అసెంబ్లీ సీట్లు పోతే టిడిపికి ఏమీ కాదు. అయినా సరే పవన్ కు ఇచ్చిన సీట్లలోనే కోత విధిస్తున్నారు. అటు పవన్ సైతం తనను తగ్గించుకుంటున్నారు. ఇప్పుడు ఈ అంశాన్ని ప్రాతిపదికగా చేసుకుని పవన్ పై వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోతోంది. పవన్ గుట్టు టిడిపి వద్ద ఉందని.. పెన్ డ్రైవ్, చిప్ అంటూ కొత్త కొత్త కథనాలు తెరపైకి తెస్తోంది. అందుకే పవన్ ఒంగి ఒంగి నమస్కారాలు పెట్టి మరి త్యాగాలు చేస్తున్నారని చెప్పుకొస్తోంది. అటు చంద్రబాబు చర్యలు సైతం అదే మాదిరిగా ఉన్నాయి. తొలి విడత జాబితాను ప్రకటించినప్పుడు జనసేన సీట్లు ఫిక్స్ చేశారు. బిజెపి వస్తే కొన్ని సీట్లు ఇస్తామని తేల్చి చెప్పారు. ఇప్పుడేమో జనసేన సీట్లు తగ్గించి బిజెపికి సర్దుబాటు చేస్తున్నారు. టిడిపి ఒక సీటు త్యాగం చేస్తే.. జనసేన మూడు సీట్లు త్యాగం చేసింది. మరో పార్లమెంట్ స్థానాన్ని సైతం వదులుకుంది. అంటే సంఖ్యాపరంగా జనసేనకు బలం తగ్గిస్తూ.. అటు ప్రత్యర్థుల వద్ద చులకన చేసే ప్రయత్నం జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయి. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే వైసీపీ సోషల్ మీడియా ఎంటర్ అయ్యింది. పవన్ ను టార్గెట్ చేసుకుంది. అనరాని మాటలు అంటోంది. ఇది చూసి సగటు జన సైనికుడు బాధపడడం తప్ప.. మరేం చేయలేకపోతున్నాడు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular