Jagan: కడప అంటే వైయస్సార్.. వైయస్సార్ అంటే కడప అన్న పరిస్థితి ఉండేది. మొత్తం రాయలసీమ రాజశేఖర్ రెడ్డి కనుసన్నల్లో నడిచేది. ఏ పార్టీ అధికారంలో ఉన్న అక్కడ ప్రభావం చూపేది రాజశేఖర్ రెడ్డి. చివరకు ఎన్టీఆర్ టైంలో కూడా ఆ కుటుంబ హవా ఉండేది. అయితే తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ అదే పరంపరను కొనసాగించారు.కానీ ఈ ఎన్నికల్లో కడపపై పట్టు కోల్పోయారు జగన్. దానికి కుటుంబంలో వచ్చిన చీలిక ప్రధాన కారణం. అయితే అంతులేని విజయంతో అధికారంలోకి వచ్చిన కూటమి కడప కోటను బద్దలు కొడుతోంది. కడప నగరపాలక సంస్థకు చెందిన ఎనిమిది మంది కార్పొరేటర్లు ఈరోజు టిడిపిలో చేరనున్నారు. చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారు. అయితే కడపకు సరైన వైసీపీ నాయకుడు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ముమ్మాటికి జగన్ స్వయంకృతాపరాధం. జిల్లా నాయకత్వ పగ్గాల విషయంలో ఆయన సీరియస్ గా దృష్టి పెట్టలేదు. కడప జిల్లా మనదే కదా అన్న ధీమాతో ఆయన ఉండిపోయారు. అందుకు మూల్యం చెల్లించుకున్నారు.
* పార్టీ శ్రేణులను కలవని ఎంపీ అవినాష్ రెడ్డి
కడప జిల్లాలో వైసీపీకి ఇబ్బందికరంగా మారారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఆయనను నమ్మి నాయకత్వ పగ్గాలు ఇచ్చారు జగన్. అయితే ఆయన పార్టీ శ్రేణులకు పెద్దగా అందుబాటులో ఉండేవారు కాదు. ఆయనను కలవాలంటే పులివెందులలో ఉదయం నాలుగు గంటల నుంచి వెయిట్ చేయాలన్న విమర్శ ఉంది. ఆ సమయంలో వెళ్తే కానీ ఆయన కలవరని సొంత పార్టీ శ్రేణులే చెబుతుంటాయి. అధికారంలో ఉన్నప్పుడు ఆయన వ్యూహాలు పనిచేశాయి. కానీ ఇప్పుడు విపక్షానికి వచ్చాను అన్న విషయాన్ని కూడా ఆయన గ్రహించలేకపోతున్నారు. ప్రస్తుతానికి కడప కార్పొరేషన్ లో ఎనిమిది మంది కార్పొరేటర్లు టిడిపిలో చేరుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఇంకా చాలామంది ఉన్నట్లు కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో వైసిపి హై కమాండ్ లో ఒక రకమైన ఆందోళన వ్యక్తం అవుతోంది.
* అదే కొంప ముంచింది
సొంత జిల్లా కదా ఎక్కడికి పోతుందిలే అన్న ధీమా కొంపముంచినట్లు తెలుస్తోంది. తమ్ముడు అవినాష్ రెడ్డికి జిల్లా బాధ్యతలు అప్పగించాను కదా.. ఆయనే అన్ని చూసుకుంటాడులే అనే భావన జగన్ లో ఉండిపోయింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. కానీ దానిని గుర్తించలేకపోతున్నారు జగన్. అది ప్రత్యర్థులకు మరింత వరంగా మారుతోంది. నేరుగా పులివెందులపైనే గురి పెట్టింది కూటమి. కడప పునాదులను కదిలించి.. వైసీపీని వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టాలని భావిస్తోంది. అందుకే ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. కానీ దానిని గుర్తించడంలో జగన్ ఫెయిల్ అవుతున్నారు. మున్ముందు చాలా రకాల దెబ్బలు వైసీపీకి తప్పదు అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. మరి వాటిని వైసిపి ఎలా అధిగమిస్తుందో చూడాలి.