Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం లాంఛనమే. ఎందుకంటే ఆయనకు వేరే ఆప్షన్ లేదు. చంద్రబాబుపై మొన్నటి వరకు పోరాడడంతో టిడిపిలోకి వెళ్లడం సాధ్యం కాదు. అటు పవన్ పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయన సైతం జనసేనలో చేర్చుకోరు. పోనీ బిజెపిలోకి వెళ్దామంటే ఆ పార్టీకి పెద్దగా ఏపీలో బలం లేదు. చాలా రోజులుగా పవర్ పాలిటిక్స్ కు దూరంగా ఉండడంతో.. 2024 ఎన్నికల్లో తాను కానీ.. తన కుటుంబ సభ్యులు గానీ ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడమే ముఖ్య ఉద్దేశంగా ముద్రగడ పావులు కదుపుతున్నారు.
అయితే ముద్రగడ వైసీపీలో చేరడంతో ఆ పార్టీకి లాభమా అన్న ప్రశ్న కూడా ఉంది. ఎందుకంటే నిన్నటిదాకా రాజకీయంగా పూర్తిగా సైలెంట్ గా ఉన్నారు. ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు కూడా చేయలేదు. కాపు ఉద్యమం మాటున యాక్టివ్ గా ఉండేవారు. గత ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ ఉద్యమంపై పోరాడారు. దానిని పతాక స్థాయికి తీసుకెళ్లారు. నా జీవితం మొత్తం కాపు జాతికి అంకితం అని చాలా సందర్భాల్లో ఆయన ప్రకటించారు. కాపులను బీసీల్లో చేర్చాలనేదే తన నినాదం అని చెప్పుకొచ్చారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమాన్ని నిలిపివేశారు. కాపుల్లో పలుచన అయ్యారు.
అయితే ఇప్పుడు ముద్రగడను తెచ్చి నెత్తిన పెట్టుకోవడం వైసీపీకి అవసరమా? అన్న ప్రశ్న నడుస్తోంది. ఎందుకంటే ముద్రగడ కుదురుగా ఉండే నాయకుడు కాదు. తనకు టిక్కెట్ ఇవ్వకపోయినా? ఆశించిన స్థాయిలో గౌరవం దక్కకపోయినా ఎదురు తిరిగే విలక్షణ శైలి ఆయనది. చంద్రబాబు విషయంలో ఈ స్థాయి విమర్శలు చేయడానికి ఈ రకమైన కారణాలే అధికం. రేపు అదే పరిస్థితి జగన్ కు ఎదురు కాదని చెప్పలేం. ఇప్పుడు కానీ ముద్రగడ వైసీపీలో చేరితే.. ఆయన పోరాటాల వెనుక జగన్ ఉన్నారన్న ప్రచారం పెరుగుతుంది. ప్రజల్లోకి బలంగా వెళితే ఇతర వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని ముద్రగడ పద్మనాభం ఎదిగారన్న విమర్శ ఉంది. 2009లో రాజశేఖర్ రెడ్డి పిలిచి అవకాశమిచ్చినా ఆయన నెగ్గుకు రాలేకపోయారు. కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే నియోజకవర్గాల్లో పోటీ చేసినా ఓటమి ఎదురైంది. కేవలం రిజర్వేషన్ ఉద్యమం తోనే ఆయన నాయకుడిగా ఎదిగారని.. క్షేత్రస్థాయిలో అంత బలమైన నాయకుడు కాదని.. సొంత సామాజిక వర్గం సైతం ఆయనను పెద్దగా పరిగణలోకి తీసుకోదని విశ్లేషణలు ఉన్నాయి. అటువంటి ముద్రగడ పద్మనాభం ను వైసీపీలో చేర్చుకున్నంత మాత్రాన పార్టీకి ఏమంత ప్రయోజనం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. పార్టీ శ్రేణులు సైతం ముద్రగడ రాకను వ్యతిరేకిస్తున్నాయి. కానీ జగన్ ఏం చేస్తారో చూడాలి.