AP Assembly Meetings : అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల పరిష్కార వేదిక. తమ నియోజకవర్గాల్లో సమస్యలను ప్రస్తావించవచ్చు ఎమ్మెల్యేలు.అధికారపక్ష వైఫల్యాలను విపక్షం ఎండగట్టవచ్చు.అయితే అటువంటి అసెంబ్లీ సమావేశాలను విపక్ష నేతలు డుమ్మా కొడుతున్నారు.రాజకీయ కారణాలతో అసెంబ్లీ ముఖం కూడా చూడడం లేదు.అయితే 2014 తరువాతే ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. అప్పట్లో టిడిపి అధికారంలోకి వచ్చింది. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు టిడిపిలోకి.ఆ క్రమంలో అధికార,విపక్షాల మధ్యగట్టి ఫైట్ నడిచింది. అప్పట్లో అధికార టిడిపికి వ్యతిరేకంగా వైసిపి తన గళం వినిపించింది.అయితే ఉన్నట్టుండి జగన్ శాసనసభను బహిష్కరించారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని శపధం చేశారు.పాదయాత్ర ప్రారంభించి ప్రజల్లోకి వెళ్లారు.ఆ ఎన్నికల్లో విజయం సాధించారు.అదే స్థాయిలో శాసనసభలో చంద్రబాబుతో పాటు టిడిపిని టార్గెట్ చేశారు. నలుగురు టిడిపి ఎమ్మెల్యేలను తన వైపు లాక్కున్నారు. చంద్రబాబు కుటుంబం పై వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో తీవ్ర మనస్థాపనతో చంద్రబాబు శాసనసభను బహిష్కరించారు. మళ్లీ సీఎంగానే అడుగు పెడతానని శపధం చేశారు. ఈ ఎన్నికల్లో టిడిపి కూటమి గెలవడంతో చంద్రబాబు సీఎం అయ్యారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు.అయితే కనీసం వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. నిబంధనలు అనుసరించి ప్రతిపక్ష నేత హోదా జగన్ కు ఇవ్వలేదు.ఆ సాకు చూపి జగన్ శాసనసభను డుమ్మా కొడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ.. శాసనసభకు రాలేనని తేల్చి చెబుతున్నారు.
* పవన్ వ్యాఖ్యలతో దుమారం
ఏపీలో పోలీస్ వ్యవస్థ తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడిన సంగతి తెలిసిందే.తాను హోం మంత్రిని కాదని.. అలా అయివుంటే పరిస్థితి వేరేగా ఉండేదని పవన్ హెచ్చరించిన సంగతి విధితమే. ఈ వ్యాఖ్యలను హోం శాఖ మంత్రి అనిత పాజిటివ్ గా తీసుకున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం అదే పనిగా డిప్యూటీ సీఎం పవన్, సీఎం చంద్రబాబుపై విమర్శలు కుప్పిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో పవన్ కామెంట్స్ పై జగన్ తాజాగా స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవని డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అనడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. శాంతిభద్రతలు అంశం ముఖ్యమంత్రి దగ్గర ఉంటుందని.. సీఎం చంద్రబాబుని ఆ విషయాన్ని ప్రశ్నించాలని పవన్ కు సూచించారు జగన్.
* మైక్ ఇవ్వకపోవడంతోనేనంటున్న జగన్
మరోవైపు అసెంబ్లీలో వైసీపీ సభ్యులకు మైక్ ఇవ్వకపోవడం వల్లే తాను అసెంబ్లీకి వెళ్లడం లేదని జగన్ చెప్పడం వింతగా ఉంది. జూన్ 12న ప్రభుత్వం ఏర్పాటయింది. అటు తరువాత జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. మరోసారి అసెంబ్లీ సమావేశాలు పెడితే.. అదే సమయంలో ఢిల్లీలో నిరసన తెలిపారు. ఇప్పుడు శాంతిభద్రతలను సాకుగా చూపి అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతున్నారు. అయితే ఇది కచ్చితంగా మైనస్ చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ మంచి అవకాశాన్ని కోల్పోతున్నారని గుర్తు చేస్తున్నారు.