AP Elections 2024: మంగళగిరిలో ఓటు రూ.4 వేలు పలుకుతోందా?

చంద్రబాబుతో పాటు పవన్ ఓడించడం దాదాపు అసాధ్యమని వైసిపి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ ఇద్దరు నేతల మెజారిటీని తగ్గించాలని మాత్రమే ప్రయత్నిస్తోంది. అయితే మంగళగిరిలో లోకేష్ ను ఓడించి ఆయన రాజకీయ జీవితాన్ని దెబ్బతీయాలని భావిస్తోంది.

Written By: Dharma, Updated On : May 10, 2024 6:57 pm

AP Elections 2024

Follow us on

AP Elections 2024: వైసిపి గట్టి పట్టుదలతోనే ఉంది. రాష్ట్రంలో అధికారంలో రావడంతో పాటు కూటమి కీలక నాయకులు ఓడిపోవాలన్న కసితో పని చేస్తోంది. కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్, మంగళగిరిలో లోకేష్ ను ఓడించాలని గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. గత ఐదేళ్లుగా ఆయా నియోజకవర్గాలపై వైసీపీ కీలక నేతలు ఫోకస్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ముగ్గురు నేతలు అసెంబ్లీ గేటు ను కూడా తాకకూడదని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే వై నాట్ 175 అన్న నినాదాన్ని బయటకు తీశారు. వై నాట్ కుప్పం, వై నాట్ పిఠాపురం, వై నాట్ మంగళగిరి అన్న నినాదాన్ని హోరెత్తించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండడంతో నిర్దిష్టమైన నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి దృష్టి పెట్టడం సాహసమే. అందుకే ఈ మూడు రోజుల పాటు ప్రజలకు తాయిలాలు ఇచ్చి.. తమ వైపు తిప్పుకోవాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి.

చంద్రబాబుతో పాటు పవన్ ఓడించడం దాదాపు అసాధ్యమని వైసిపి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ ఇద్దరు నేతల మెజారిటీని తగ్గించాలని మాత్రమే ప్రయత్నిస్తోంది. అయితే మంగళగిరిలో లోకేష్ ను ఓడించి ఆయన రాజకీయ జీవితాన్ని దెబ్బతీయాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో సిట్టింగ్ మంత్రిగా ఉన్న లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మంగళగిరిలో టిడిపి గెలిచిన దాఖలాలు లేవు. టిడిపి ఆవిర్భావం తర్వాత ఒక్కసారి మాత్రమే ఆ పార్టీ గెలిచింది. ఆ నియోజకవర్గాన్ని లోకేష్ ఎంచుకోవడం ఒక సాహస ప్రక్రియ. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయిన లోకేష్ పై నియోజకవర్గంలో సానుభూతి కనిపిస్తోంది. అయితే ఆ సానుభూతిని సామాజిక కోణంలో దెబ్బతీయాలని వైసీపీ భావిస్తోంది. పద్మశాలి వర్గానికి చెందిన మురుగుడు లావణ్యను అభ్యర్థిగా ఎంపిక చేశారు జగన్.

అయితే మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ పై సానుభూతి వ్యక్తం అవుతుండడంతో.. దానిని అధిగమించే ప్రయత్నం చేస్తోంది వైసిపి. ఓటుకు నాలుగువేల రూపాయల చొప్పున చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆపై పెద్ద ఎత్తున మద్యం పంపిణీకి సైతం వైసీపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా కూటమి తరపున ప్రచారం చేస్తున్నారు. కానీ లోకేష్ తరఫున మంగళగిరిలో ఇతర నేతలు ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. ఇదే అదునుగా లోకేష్ ను ఓడించాలని వైసిపి తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే ఎలక్షన్ కమిషన్ నిఘా పెంచాలని కోరుతున్నారు. వైసీపీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మంగళగిరిలో లోకేష్ అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి శ్రేణులు భావిస్తున్నాయి. అయితే అక్కడ ఫలితం ఎలా వస్తుందో చూడాలి.