Srimata Kala Peetham IPRS Event: ‘రాను రానంటూనే చిన్నదో.. చిన్నదో.. రాములోడి గుడికి వచ్చే చిన్నదో చిన్నదో’.. ఈ పాట అంటే ముందుగా గుర్తుకొచ్చేది సుప్రసిద్ధ సినీ సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్. ఆయన ఉత్తరాంధ్రకు చెందిన వారు కావడం గమనార్హం. అందుకే ఆయన స్వరఝరిలో ఎన్నో రకాల జానపద పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. అన్నింటికీ మించి ఉత్తరాంధ్ర జానపదాలు బతకాలన్న కోరిక ఆయనది. అటువంటి వ్యక్తి ముఖ్య అతిథిగా.. ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ దక్షిణాది విభాగం ప్రత్యేక సమావేశం విశాఖలోని శ్రీమాతా కళా పీఠం ఆధ్వర్యంలో జరిగింది. శ్రీ మాతా రికార్డింగ్ కంపెనీ లో జరిగిన జరిగిన ఈ సమావేశానికి ఉత్తరాంధ్రకు చెందిన ఔత్సాహిక జానపద, ఆధ్యాత్మిక, సంగీత కళాకారులు హాజరయ్యారు. కళాకారుల కోసం, కళల కోసం మరోసారి ఈ గురుతుర బాధ్యతను తీసుకున్నారు శ్రీమాతా కళా పీఠం అధినేతలు భిన్నాల నరసింహమూర్తి, పల్లి నాగభూషణం. ఎక్కడెక్కడో స్థిరపడిన కళాకారులను సమీకరించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా.. కళాకారులు ఎలా ముందుకెళ్లాలి.. డిజిటల్ మీడియా సామ్రాజ్యం ఏలుతున్న తరుణంలో ఓటిటి ప్లాట్ఫారం ద్వారా ఎలా ముందుకు సాగాలి అన్న దానిపై కళాకారులకు అవగాహన కల్పించారు. ఆదాయ మార్గాలపై కూడా ఈ సమావేశంలో చర్చించి కళాకారులకు కీలక సూచనలు చేశారు. ఔత్సాహిక కళాకారుల కోసం ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ చేపడుతున్న కృషిని మేనేజర్ బాలమురళి వివరించారు. ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీలో చేరితే మూడు లక్షల రూపాయల బీమా సదుపాయంతో పాటు కళాకారులకు సరైన ఆదరణ, ఆదాయం దక్కే మార్గాలను సూచిస్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా ఈ సమావేశం శ్రీమాతా కళా పీఠం ఆధ్వర్యంలో నిర్వహించగా.. సమావేశానికి హాజరైన కళాకారులకు భోజన, ఇతరత్రా వసతి కూడా కల్పించారు.
శ్రీమాతా కళాపీఠం ఆధ్వర్యంలో..
పల్లె పాట వినిపించే ప్రతి చోట ‘శ్రీమాతా’.. ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం. అసలు పల్లె పాటకు విశ్వవ్యాప్తం చేసిందే శ్రీమాతా. అదో బాధ్యతగా.. భావితరాలకు జానపద సంపదగా అందించేందుకు పరితపించింది. వందలాది మంది ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించింది. మట్టిలో ఉన్న మాణిక్యాలను వెలికితీసింది. వారి గొంతులో ఉన్న శ్రావ్యతను గుర్తించి.. వెన్నుతట్టి ప్రోత్సహించి వారికో సమాజంలో గుర్తింపు తీసుకు రావడంలో కీలకపాత్ర పోషించింది. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన కళాకారులను సైతం అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టింది. గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో ద్వారా అగ్రరాజ్యంలో ప్రదర్శనలు ఇప్పించింది. ఖండాంతరాలలో కూడా వారికి ఒక ఖ్యాతిని తెచ్చింది. ఇప్పుడు ఇండియన్ ఫెర్ ఫార్మింగ్ రైట్స్ సొసైటీ సౌత్ ఇండియన్ విభాగంలో భాగస్వామ్యం చేసే గురుతర బాధ్యతను తీసుకుంది. కళాకారుల ఆదాయ మార్గాలు పెంపొందించే చర్యలు చేపట్టింది. వారి భవిష్యత్తుకు చక్కటి మార్గాన్ని చూపే ప్రయత్నాల్లో ఉంది.
నూతన కార్యవర్గం..
ఈ సందర్భంగా ఐపిఆర్ఎస్ దక్షిణాది రాష్ట్రాల విభాగానికి సంబంధించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధానంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్, సంగీత దర్శకురాలు ఎం ఎం శ్రీలేఖ, శ్రీమాతా సంస్థ అధినేత పల్లి నాగభూషణరావు, మధుర ఆడియో ప్రతినిధి మధుర శ్రీధర్ రావులను నూతన కార్యవర్గ ప్రతినిధులుగా ఎన్నుకున్నారు.
శుభ పరిణామం..సంగీత దర్శకుడు ఆర్పీ..
ఉత్తరాంధ్ర జానపద కళలకు విశేష ఆదరణ లభిస్తుందడం హర్షించదగ్గ పరిణామం అని ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ అన్నారు. ఈ సమావేశంలో ఆయన కీలక ఉపన్యాసం చేశారు. తన ప్రతి సినిమాలో ఉత్తరాంధ్రకు సంబంధించి జానపద పాటను కచ్చితంగా పాడించే వాడినని గుర్తు చేసుకున్నారు. ఉత్తరాంధ్ర కళాకారులకు కేరాఫ్ గా శ్రీమాతా సంస్థలు నిలవడం ఆనందంగా ఉందని చెప్పారు. ఉత్తరాంధ్ర కళాకారులను ఒకే వేదిక పైకి తెచ్చి.. ఇండియన్ సర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీలో చేర్చడం అనేది గొప్ప విషయమని చెప్పారు. ఈ అవకాశాన్ని ఔత్సాహిక కళాకారులు సైతం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ రామకృష్ణ ఆనంద, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ ఈశ్వర వెంకట రామనాథశాస్త్రి, శ్రీరంగం జోగి పంతులు, సోమయాజులు, కవి ఐనాడ దుర్గాప్రసాద్, సంగీత దర్శకులు తాడాల శ్రీనివాస్, త్రినాధ మూర్తి, జానపద గాయకులు మద్దిల నారాయణ, మురపాల నారాయణ, రేలా రేలా రఘు, నిర్మల, సంతు, ఆల్ ఇండియా రేడియో కళాకారులు కీరవాణి ప్రసాద్, కట్టు హరి, రాంభశ్రీ, ఐకా రమేష్, గుడ్ల తేజ, సాల్మన్ రాజు, సీర అనిత, బేసి హరిబాబు, నారాయణ రావు, జీవనాధ్ యాదవ్, సినీ నటులు లక్ష్మీ కిరణం, గాయకులు దుర్గా, ప్రముఖ రచయిత శ్రీమతి ప్రభాశర్మ, కోరాడ అప్పారావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ సమావేశానికి, ప్రతినిధులకు విజయనగరం నగర పాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అభినందనలు తెలిపారు. కార్యక్రమానికి ముందుగా కుమారి హర్షిత ఆలపించిన గేయం వీనుల విందుగా సాగింది. సమావేశం అసాంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది.