Investments In Visakhapatnam: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటుతోంది. ఒకవైపు సంక్షేమ పథకాలతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పన జరుగుతోంది. అమరావతి రాజధాని నిర్మాణం తో పాటు పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ఇంకోవైపు విశాఖకు భారీగా ఐటి పరిశ్రమలు తరలివస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల పనితీరుపై ప్రజలనుంచి సంతృప్తి వస్తోంది. తొలి 16 నెలల్లోనే పారిశ్రామిక పెట్టుబడులను తీసుకురావడంలో కూటమి ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాయి. ముఖ్యంగా ఐటీ పరిశ్రమలు విశాఖకు పెద్ద ఎత్తున తరలివస్తున్నాయి. ప్రభుత్వం పట్ల పాజిటివిటీ పెరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పరిశ్రమలకు ఇచ్చిన భూములపై కోర్టులో పిటిషన్లు వేస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. వాటిపై వాదనలు వినిపించబోతున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులు.
* వ్యతిరేక పిటిషన్లు.. విశాఖకు( Visakhapatnam) భారీ ఐటి పరిశ్రమలు తరలి వచ్చాయి. ముఖ్యంగా ఐటీ స్పేస్ డెవలప్మెంట్ చేయడంలో పేరు మోసిన సత్వ కంపెనీ కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. అయితే ఆ కంపెనీకి ఇవ్వాలనుకుంటున్న భూమి విషయంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం విశేషం. అయితే ఇలా పిటిషన్లు వేస్తున్న వారంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులే. అయితే ఒక సత్వ కు మాత్రమే కాదు.. ఇతర ఐటీ కంపెనీలకు ఇస్తున్న భూములపై పిటిషన్లు వేశారు. చివరకు గూగుల్ డేటా సెంటర్ కోసం సేకరిస్తున్న భూముల విషయంలోనూ చనిపోయిన వ్యక్తి పేరుతో పిటిషన్ వేసి దొరికిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న కుట్రలు, ఏపీకి పెట్టుబడులు రాకుండా కోర్టుల ద్వారా న్యాయవివాదాలను సృష్టించే ప్రయత్నాలు చేయడం విస్మయ పరుస్తోంది.
* ప్రయత్నాలు భగ్నం
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల చర్యలు తెలుసు. వారు వేసే ప్రతి అడుగు భగ్నం చేస్తోంది ప్రభుత్వ అనుకూల మీడియా. దీంతో వీరి అసలు సమస్య ఏంటి అన్న చర్చ ప్రజల్లో నుంచి వస్తోంది. ఇప్పటివరకు చంద్రబాబుపై వ్యవస్థలను మేనేజ్ చేస్తారని ఆరోపణలను చేసింది వైసిపి. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాజకీయ కుట్రలే కాదు.. రాష్ట్రంపై కుట్రలు చేసేందుకు.. పెట్టుబడులు రాకుండా చేయడానికి కూడా వ్యవస్థలను అడ్డం పెట్టుకున్నారన్న అనుమానాలు ప్రజల్లో పెరుగుతున్నాయి. రాష్ట్ర అభివృద్ధి విషయంలో సహకరించాల్సింది పోయి వ్యతిరేక ప్రచారం చేయడం ఏమిటన్న ప్రశ్న ప్రజల నుంచి వినిపిస్తోంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వినే పరిస్థితిలో లేదు. ఇలానే కొనసాగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది.