AP Investments: ఏపీకి( Andhra Pradesh) భారీగా పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచంలో ఐటి పరంగా గుర్తింపు పొందిన గూగుల్ విశాఖలో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. వచ్చే నెలలో గూగుల్ రానుందని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే టిసిఎస్ కూడా విశాఖలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఉమ్మడి విశాఖలోని ప్రైవేటు ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అర్సెలర్ మిత్తల్ కంపెనీ స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది. కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు వీటిపై మాట్లాడారు. మౌలిక సదుపాయాలపై ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయని అభిప్రాయపడ్డారు సీఎం చంద్రబాబు. అయితే ఈ కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కొత్త టాస్క్ ఇచ్చారు.
* ప్రత్యేక కార్యాచరణ..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొత్త చర్యలు కూడా చేపట్టింది. పెట్టుబడి ప్రతిపాదనల గురించి తెలుసుకునేందుకు కలెక్టర్లకు ప్రత్యేక లాగిన్ సౌకర్యం కూడా కల్పించింది. ప్రతి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి ఒక కాల పరిమితిని కూడా నిర్ణయించింది. ఎకనామిక్ హబ్లో సమస్యలు పరిష్కరించడానికి ఒక అధికారిని నియమించేందుకు కూడా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 20 క్లస్టర్లతో పాటు కొత్తగా 30 క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం 1.1 లక్షల ఎకరాల భూమిని గుర్తించారు. పారిశ్రామిక కారిడార్ల దగ్గర 15 క్లస్టర్ల కోసం 74,583 ఎకరాలు కేటాయించారు. తీరం వెంబడి 15 క్లస్టర్ల కోసం 56,608 ఎకరాలను గుర్తించారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి అవసరమైతే పదవీ విరమణ చెందిన అధికారులు, ఉద్యోగుల సాయం కూడా తీసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు.
* పరిశ్రమల ఏర్పాటు పై క్లారిటీ..
ఏపీలో పరిశ్రమల ఏర్పాటు పై చంద్రబాబు( CM Chandrababu) ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో పారిశ్రామికంగా ఏపీని అభివృద్ధి పథంలో నిలుపుతామని చెప్పుకొచ్చారు. రాయలసీమలో కడప ఉక్కు కర్మాగారం, కొప్పర్తి, ఓర్వకల్ లో పరిశ్రమలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అనంతపురంలోని లేపాక్షి, కర్నూలులోని ఓర్వకల్లు మధ్య ప్రాంతాన్ని భారీ ఇండస్ట్రియల్ హబ్ గా మార్చుతామని చెప్పారు. లాజిస్టిక్ కార్పొరేషన్ ద్వారా పోర్టులు, విమానాశ్రయాల మధ్య రోడ్డు నెట్వర్క్ ను అభివృద్ధి చేయాలని కూడా ఈ సందర్భంగా సూచించారు. తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్, నౌకల తయారీ కేంద్రం, ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తామని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. కొత్త విమానాశ్రయాలు నిర్మాణంతో ఎకనామిక్ హబ్ గా ఆ ప్రాంతం మారుతుందని చెప్పారు.