Visakhapatnam: విశాఖలో( Visakhapatnam) అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు జరగనుంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు, నారా లోకేష్ బృందం సింగపూర్లో పర్యటించింది. అక్కడి పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించింది. అయితే తాజాగా విశాఖలో పెట్టుబడుల సదస్సుకు సంబంధించి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. మధ్యాహ్నం కి ఢిల్లీ చేరుకొని.. ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఐటిసి మౌర్యలో జరిగే సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అక్కడే పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తారు. సీఐఐ ఆధ్వర్యంలో విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు తరలిరావాలని కోరనున్నారు.
* ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా..
విశాఖ పెట్టుబడుల సదస్సును ఏపీ ప్రభుత్వం( AP government) ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ముందుగానే సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు బృందం సింగపూర్ లో పర్యటించి అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశం అయింది. విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుకు వస్తే ఏపీ ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహాలు అందిస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు. అంతకుముందు లండన్ లో పర్యటించారు నారా లోకేష్. అలాగే దావోస్ పర్యటనకు కూడా వెళ్లారు. ఆ సమయంలో కూడా దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. వారితో ప్రత్యేక రోడ్డు షో నిర్వహించారు. వాటి ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. విశాఖ సదస్సుతో భారీగా పెట్టుబడులు తేవాలన్నది ప్రభుత్వ ప్రణాళికగా తెలుస్తోంది.
* మంత్రుల బృందం పర్యటన..
మరోవైపు ఏపీ మంత్రుల బృందం దక్షిణ కొరియాలో( South Korea) పర్యటించింది. విశాఖలో నిర్వహించనున్న పారిశ్రామిక పెట్టుబడుల సదస్సుకు తరలి రావాలని అక్కడి ప్రతినిధులను కోరారు మంత్రులు. మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి తో పాటు సీనియర్ అధికారులు ఈ బృందంలో ఉన్నారు. దక్షిణ కొరియా రాజధాని సీయోల్ లో ఎల్జి కంపెనీ ప్రతినిధులతో మంత్రుల బృందం సమావేశం అయింది. మరోవైపు విద్యుత్తు వస్తువుల తయారీకి సంబంధించి ఎల్ ఎస్ గ్రూప్ కంపెనీ ప్రతినిధులతో కూడా సమావేశం అయింది. మెడికల్, స్మార్ట్ సూట్ తయారీలో అగ్రగామిగా ఉన్న సు ఆల్ సంస్థ చైర్మన్ చివోంగు లీతో కూడా సమావేశం అయ్యింది మంత్రుల బృందం. వారంతా విశాఖ పెట్టుబడుల సదస్సుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రుల బృందం చెబుతోంది. మొత్తానికైతే విశాఖలో పెట్టుబడుల సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏపీ ప్రభుత్వం. సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మరి ఈ పెట్టుబడుల సదస్సులో ఏ స్థాయిలో.. పరిశ్రమలు ఏర్పాటుకు దిగ్గజ పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారో చూడాలి.