Balakrishna: ఏపీలో( Andhra Pradesh) ఒక రాజకీయ ఆసక్తికర పరిణామం జరిగింది. అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో పెను దుమారం రగిలింది. నాడు వైసిపి ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి సినీ పరిశ్రమను అవమానించారని బిజెపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అయితే అప్పట్లో చిరంజీవి అడగడం వల్లే వెనక్కి తగ్గారని చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు బాలకృష్ణ. జగన్మోహన్ రెడ్డిని ఎవరు గట్టిగా అడగలేదని.. అది తప్పని తేల్చి చెప్పారు. అయితే మధ్యలో చిరంజీవి ప్రస్తావన రావడంతో విదేశాల్లో ఉన్న ఆయన ఒక ప్రకటన విడుదల చేసి అప్పట్లో జరిగిన దానిపై క్లారిటీ ఇచ్చారు. అది మొదలు రాజకీయ రచ్చ ప్రారంభం అయ్యింది. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలతోనే అనవసర దుమారం రేగిందని.. దీనిపై టిడిపి నాయకత్వం ఆగ్రహంగా ఉందని ప్రచారం సాగుతోంది.
* అలా దిద్దుబాటు..
అయితే బాలకృష్ణ( Nandamuri Balakrishna) వివాదం తర్వాత దిద్దుబాటు చర్యలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు చొరవ తీసుకున్నారు. జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. ఆయనతో ఏకాంతంగా సమావేశం అయ్యారు. కచ్చితంగా ఈ వివాదం గురించి ఇద్దరు నేతలు మాట్లాడుకుని ఉంటారని ఒక అంచనా ఉంది. అదే సమయంలో బాలకృష్ణను టిడిపి హై కమాండ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరినట్లు ప్రచారం సాగింది. అయితే తాను తప్పు మాట్లాడలేదని.. వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ఉద్దేశం లేదని బాలకృష్ణ తేల్చి చెప్పినట్లు ప్రచారం నడిచింది. ఈ తరుణంలో ఈ వివాదానికి మూల కారణమైన తన వ్యాఖ్యలను, తరువాత జరిగిన పరిణామాలను రికార్డులనుంచి తొలగించాలని బిజెపి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కోరారు. దీంతో స్పీకర్ కామినేని వ్యాఖ్యలతో పాటు బాలకృష్ణ వ్యాఖ్యలను కూడా రికార్డుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.
* ఆ పదవి కోసం సిఫారసు..
అయితే తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో( CM Chandrababu) పాటు మంత్రి నారా లోకేష్ పై నందమూరి బాలకృష్ణ ఆగ్రహంగా ఉన్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. మరోవైపు బాలకృష్ణ మరో డిమాండ్ ను తెరపైకి తెచ్చారని.. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి తాను సూచించిన వ్యక్తికి ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే గతంలో ఈ పదవిని హరిహర వీరమల్లు సినిమా నిర్మాత ఏఎం రత్నం పేరును సిఫార్సు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో కలత చెందిన బాలకృష్ణ హై కమాండ్ ఎదుట ఈ సిఫారసు పెట్టినట్లు సమాచారం. సాధారణంగా నందమూరి బాలకృష్ణ ఏదీ కోరరు. అటువంటిది ఇప్పుడు తాజాగా ఈ డిమాండ్ తెరపైకి తేవడం ఆసక్తికరంగా మారింది. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.