Youngest Minister Ram Mohan Naidu: దేశంలో ఇప్పుడు ఇండిగో( Indigo) విమాన సంక్షోభం నడుస్తోంది. ఇండిగో విమానయాన సంస్థ సృష్టించిన సంక్షోభం యావత్ భారతదేశాన్ని ఇబ్బంది పెడుతోంది. ఐదు లక్షల మంది విమాన ప్రయాణికులు సైతం తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థ పై సైతం ఈ ప్రభావం కనిపించింది. అయితే ఒక ఇండిగో కంపెనీ నిర్లక్ష్యంతో భారత ప్రభుత్వం విమర్శల పాలయింది. ముఖ్యంగా పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పై అందరి దృష్టిపడింది. విమర్శకుల నోళ్ళు ఆయనపైనే తెరుచుకున్నాయి. ఆయనను బాధ్యుడిని చేస్తూ విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. అయితే పరిస్థితిని గమనించిన రామ్మోహన్ నాయుడు పార్లమెంటులో తనదైన ప్రకటన చేశారు. చాలా బాధ్యతయుతంగా మాట్లాడారు. అదే ఇండిగోపై వెను వెంటనే చర్యలకు ఉపక్రమిస్తే సంక్షోభం మరింత తీవ్రమయ్యేది. అందుకే విపక్షాలు ఎంత రెచ్చగొడుతున్నా.. ఎన్ని రకాల విమర్శలు వచ్చినా రామ్మోహన్ నాయుడు చలించలేదు. అయితే ఇప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం రామ్మోహన్ నాయుడు పై ఉంది. తప్పకుండా ఇండిగో గుత్తాధిపత్యాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తే కానీ.. మరోసారి ఇలాంటి సంక్షోభం సృష్టించేందుకు ఏ ఎయిర్లైన్స్ సంస్థ సాహసించదు.
అప్పట్లో టాటా చేతిలో..
గతంలో ఎయిర్ ఇండియా( Air India ) ఎయిర్ లైన్స్ టాటా సంస్థ చేతిలో ఉండేది. అప్పట్లో కూడా దాని గుత్తాధిపత్యం పెరగడంతో 1953లో జాతీయం చేయబడింది. 1932లో ఎయిర్ ఇండియాను జే ఆర్ డి టాటా ప్రారంభించారు. ఆ సంస్థను 1953లో ప్రభుత్వం జాతీయం చేసింది. అప్పట్లో ఇండిగో మాదిరిగా గుత్తాధిపత్యంతో ముందుకు సాగింది ఇండియా ఎయిర్లైన్స్. అందుకే 1953లో ప్రభుత్వం దానిని జాతీయం చేసింది. అక్కడకు 70 సంవత్సరాలు తర్వాత 2022 జనవరిలో టాటా గ్రూపు అదే ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసింది. మరోసారి ఆ పరిస్థితి ఇండిగో సంస్థకు రుచి చూపించాల్సిన అవసరం సంబంధిత మంత్రి రామ్మోహన్ నాయుడు పై ఉంది.
విమానయానంలో పెద్దది..
ఇండిగో విమానయాన సంస్థ భారత డొమెస్టిక్ ఎయిర్ లైన్స్ లో( Indian domestic airlines) 60 శాతం వాటా కలిగి ఉంది. మంచి సమయపాలనతో పాటు ఉత్తమ సేవలు అందిస్తూ వచ్చింది ఇండిగో. కేవలం పైలట్ల విశ్రాంతి విషయంలో భారత విమానయాన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అమలు చేసిన కొత్త ఫ్లైట్ డ్యూటీ విధానంతోనే ఇండిగో ఈ సంక్షోభం సృష్టించింది. ఇది గత నవంబర్ నుంచి అమలు చేయాలని సూచించగా.. నెల రోజుల్లోనే చేతులెత్తేసింది ఇండిగో సంస్థ. ఇది ముమ్మాటికి ఆ సంస్థ కృత్రిమ సంక్షోభం. దేశంలో 60 శాతం డొమెస్టిక్ ప్రయాణికుల వాటాను కలిగిన అతిపెద్ద విమానయాన సంస్థగా, ఇండిగో రోజుకు 2200 లకు పైగా విమానాలు నడుపుతోంది. అటువంటి సంస్థ బాధ్యత రాహిత్యంగా వ్యవహరించింది. అతిపెద్ద విమానయాన సంస్థగా ఈ సంక్షోభానికి కారణం అయ్యింది.
ఆ అపవాదుకు చెక్
ఒక ప్రైవేటు విమానయాన సంస్థ నిర్లక్ష్యం ఇప్పుడు మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడుకు పెద్ద అపవాదుగా మారింది. అందుకే ఆయన దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇండిగో గుత్తాధిపత్యానికి కళ్లెం వేయాల్సిన అవసరం ఇందిరాపు రామ్మోహన్ నాయుడు పై ఉంది. గతంలో టాటా కంపెనీ ఎయిర్ ఇండియా విషయంలో జరిగిన వ్యవహారాన్ని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. దేశంలో మిగతా ప్రైవేటు ఎయిర్లైన్స్ కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు ప్రభుత్వపరంగా రాయితీలు కల్పిస్తే అవి పుంజుకునేందుకు అవకాశం ఉంటుంది. అదే సమయంలో మున్ముందు ఇండిగో సంస్థను అణచి వేసేందుకు కూడా రామ్మోహన్ నాయుడు ప్రయత్నించాల్సి ఉంటుంది. అది జరిగితే కానీ భవిష్యత్తులో ఇటువంటి సంక్షోభాలు తలెత్తవు. పైగా యువనేతగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ఇది ఒక విషమ పరీక్ష గానే గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది.