AP Exit Poll Result 2024: ఆమధ్య కాన్ క్లెవ్ పెట్టుకుంటానంటే ప్రభుత్వ ఖజానా నుంచి జగన్ డబ్బులు ఇచ్చాడు. రాజ్ దీప్ సర్దేశాయ్ ఇంటికి వస్తే కడుపునిండా అన్నం పెట్టాడు. రకరకాల మాంసాహార వంటకాలు సిద్ధం చేశాడు. అయినప్పటికీ ఇండియా టుడే వైసిపి పై ఉదారత చూపలేదు. పైగా గత ఎన్నికల్లో చూపించిన వేవ్ లేదని.. ఫ్యాన్ గాలిని దారుణంగా తీసేసింది. శనివారం దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి.. అందులో ఇండియా టుడే మై యాక్సిస్ అనే సంస్థ ప్రకటించిన ఎగ్జిట్ పోల్ కూడా ఉంది. దీని ప్రకారం ఏపీలో ఈసారి అధికార వైసీపీకి తిరుగులేని పరాభవం ఎదురవుతుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ లో ప్రకటించింది. ఇంతకీ ఈ సంస్థ ఎగ్జిట్ పోల్ ఎలా ఉందంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో అప్పటి వైసిపి ఏకంగా 22 స్థానాలు గెలుచుకుని సంచలనం సృష్టించింది. అప్పుడు అధికారంలో ఉన్న టిడిపి కేవలం మూడు పార్లమెంట్ స్థానాలతోనే సరిపెట్టుకుంది. కానీ ఈ ఐదేళ్లలోనే ఏపీలో పరిస్థితి తారుమారైనట్టు ఇండియా టుడే వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ద్వారా తెలుస్తోంది. ఈ సంస్థ ప్రకటించిన ఎగ్జిట్ పోల్లో కూటమికి 21 నుంచి 23 వరకు పార్లమెంటు స్థానాలు వస్తాయని తేలింది. ఇదే సమయంలో వైసీపీకి రెండు నుంచి నాలుగు ఎంపీ స్థానాలు వస్తాయని ప్రకటించింది. గత ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 22 పార్లమెంటు స్థానాలను గెలుచుకొని సంచలనం సృష్టించింది. అయితే ఈసారి ఆ సంఖ్య దారుణంగా పడిపోవడం విశేషం.
ఎన్నికలకు ముందు పలు స్థానాలకు జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థులను మార్చారు. ఒక చోట నుంచి మరొక చోటికి పంపించారు. ఇది సాధారణంగా అభ్యర్థులకు ఇష్టం లేకపోయినప్పటికీ.. జగన్ మాటకు ఎదురు చెప్పే సాహసం చేయలేక, వారు ఆయన సూచించిన చోట్ల పోటీ చేశారు. అయితే అది ప్రతిబంధక ఫలితాన్ని ఇస్తున్నట్టు ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ లో స్పష్టమైంది. ఇక మనదేశంలో ఇండియా టుడే మై యాక్సిస్ ప్రకటించే ఎగ్జిట్ పోల్ కు విశ్వసనీయత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు ఈ సంస్థ ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా నిజమయ్యాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపుగా నిజమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండియా టుడే ఏపీలో ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన దగ్గరనుంచి పలు దఫాలుగా సర్వే ఫలితాలను ప్రకటించింది. వాటి ప్రకారం వైసీపీకి ఏ సర్వే లోనూ అనుకూల ఫలితం రాలేదు.