MP Avinash Reddy – CBI : అవినాష్ అరెస్ట్ తప్పదా? వెతుక్కుంటూ ఆస్పత్రికొచ్చిన సీబీఐ అధికారులు

రుగా ఇప్పుడు అవినాష్ వద్దకే సీబీఐ అధికారులు వెళ్లడం.. ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతుండడం హీట్ పెంచుతోంది. ఏదో ఒక సంచలనం నమోదవుతుందని సంకేతాలు వెలువడుతున్నాయి.

Written By: Dharma, Updated On : May 22, 2023 12:19 pm
Follow us on

MP Avinash Reddy – CBI : వివేకా హత్యకేసులో కీలక ట్విస్ట్. విచారణకు హాజరుకాలేనన్న ఎంపీ అవినాష్ రెడ్డి వద్దకు సీబీఐ  అధికారులు చేరుకున్నారు. ఈ నెల 19న విచారణకు హాజరుకావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ వచ్చినట్టే వచ్చి ఆయన పులివెందుల తిరుగు పయనయమయ్యారు. తన తల్లికి అనారోగ్యమని లేఖ రాశారు. నాలుగు రోజులు సమయం కావాలని అడిగారు. అయితే ఇప్పటికే రెండు సార్లు విచారణ నుంచి వాయిదా కోరిన అవినాష్ రెడ్డికి సోమవారం తప్పకుండా హాజరుకావాలని సీబీఐ మళ్లీ  నోటీసులిచ్చింది. అయితే తన తల్లి ఆరోగ్యం కుదటుపడలేదని.. మరో పదిరోజులు రాలేనని అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు సీరియస్ అయ్యారు. కీలక చర్యలకు సిద్ధమవుతున్నారు.

అవినాష్ రెడ్డి ప్రస్తుతం కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో ఉన్నారు. అక్కడే అతడి తల్లి వైద్యసేవలు పొందుతోంది. అక్కడి వైద్యులు కూడా అవినాశ్ తల్లి ఆరోగ్యం కొంత ఆందోళన కరంగా ఉందని ప్రకటించారు. ఈ సమయంలో అవినాష్  తాను విచారణకు రాలేనని చెప్పటంతో, ఇప్పుడు కర్నూలులోని ఆస్పత్రి వద్దకు సీబీఐ అధికారులు చేరుకున్నారు. ముందుగానే కర్నూలు ఎస్పీకి సమాచారం ఇచ్చారు. దీంతో ఆస్పత్రి వద్ద భారీగా పోలీసు బలగాలను మొహరించారు. అటు కడప జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో అవినాశ్ అభిమానులు, వైసీపీ నాయకులు చేరుకున్నారు. కానీ వారిని పోలీసులు అక్కడ నుంచి పంపేస్తున్నారు. సమీపంలోని దుకాణాలను సైతం మూసివేయించారు.

స్థానిక పోలీసుల సాయంతో ఆస్పత్రిలోకి సీబీఐ అధికారులు ప్రవేశించినట్టు తెలుస్తోంది. అవినాష్ రెడ్డితో సమావేశమైనట్టు సమాచారం.  సీబీఐ అధికారుల రాక సమాచారం తెలుసుకున్న అవినాశ్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఇంకా అక్కడకు చేరుకుంటున్నారు. విశ్వ భారతి ఆస్పత్రి వద్ద హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. వాస్తవానికి 19వ తేదీన పులివెందులకు తిరుగుముఖం పట్టిన అవినాష్ రెడ్డి కాన్వాయ్ ను సీబీఐ వెంటాడినట్టు వార్తలు వచ్చాయి. అదే సమయంలో మీడియా వాహనాలపై ఆయన అనుచరులు దాడులు చేశారు. సోమవారం విచారణకు హాజరుకావాలని నోటీసులు.. దానికి పదిరోజులు సమయం కావాలని కోరుతూ అవినాష్ లేఖ.. నేరుగా ఇప్పుడు అవినాష్ వద్దకే సీబీఐ అధికారులు వెళ్లడం.. ఇలా ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతుండడం హీట్ పెంచుతోంది. ఏదో ఒక సంచలనం నమోదవుతుందని సంకేతాలు వెలువడుతున్నాయి.