Heavy Rain in AP : ఏపీని వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేని వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అయ్యింది. విజయవాడ నగరంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 50 ఏళ్ల కాలంలో ఈ స్థాయిలో వర్షం కురవడంతో ఇదే రికార్డు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకేరోజు 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం. విజయవాడలోని అనేక కాలనీలో నాలుగు అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. కృష్ణా నదికి భారీగా వరద పోటీ తొండడంతో నగరంలోని పలు ప్రాంతాలను అలెర్ట్ చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్క విజయవాడ, గుంటూరు జిల్లాలోని వర్షాలతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. విజయవాడలో కొండ చరియలు విరిగిపడి ఆరుగురు, గుంటూరులో వరదలు కారు కొట్టుకుపోయి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. కాలువలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. కాజా టోల్ ప్లాజా వద్ద హైవేపై భారీగా వరద నీరు చేరింది. విజయవాడలో 50 ఏళ్ల రికార్డు వర్షం నమోదయింది. విజయవాడలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షం గత ఐదు దశాబ్దాల కాలంలోనే అత్యధికంగా భావిస్తున్నారు. 2020 అక్టోబర్ 13న 122 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అయితే ఇప్పుడు ఏకంగా 174 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం.
* అధికారులకు కీలక ఆదేశాలు
మరోవైపు వరదల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వర్షాలపై సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంగళగిరిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో సహాయ చర్యల కోసం జిల్లాకు మూడు కోట్ల రూపాయల చొప్పున నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.
* వరద ప్రాంతాల్లో సందర్శన
మరోవైపు మంత్రి లోకేష్ వరద ముంపు ప్రాంతాలను సందర్శించారు. మంగళగిరి నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం నుంచి పర్యటిస్తున్నారు.బాధిత ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అటు మంత్రులు ప్రజాప్రతినిధులు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రజలకు భరోసా ఇస్తున్నారు.వరద ఉధృతికి చనిపోయిన కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.
* ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద
భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగాచేరుతోంది. 72 గేట్లను ఎత్తి యధాతధంగా నీటిని కిందకు విడిచి పెడుతున్నారు. విజయవాడ మార్గంలో చాలా చోట్ల రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్నాయి. దీంతో చాలా మార్గాల్లో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. కాగా శనివారం అర్ధరాత్రి దాటాక శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వద్ద తుఫాన్ తీరం దాటింది. తరువాత బలహీన పడింది. దాని ప్రభావం మరో రెండు రోజులు పాటు ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాలు విస్తారంగా పడతాయని స్పష్టంగా చేసింది.